బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (05:27 IST)

పున్న‌మీఘాట్ లో మ‌హా రుద్రాభిషేకం

హ‌ర‌…హ‌ర‌.. మ‌హాదేవ‌.. శంభోశంక‌రా… ఓంశ‌క్తి… ఓం న‌మ‌శ్శివాయ‌.. అంటూ భ‌క్తుల శివ నామ‌స్మ‌ర‌ణ‌తో పున్న‌మీఘాట్ ప్రాంతం ఆదివారం సాయంత్రం మారుమ్రోగింది.

ప్ర‌స్తుతం సంభ‌విస్తున్న విప‌త్తుల కార‌ణంగా అనేక ర‌కాలుగా బాధ‌ప‌డుతున్న మాన‌వాళికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు, భ‌క్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రాప్తించాల‌నే సంక‌ల్పంతో, ప‌విత్ర కార్తీక మాసం సంద‌ర్భంగా లోక క‌ళ్యాణార్థం విజ‌య‌వాడ అర్బ‌న్ జిల్లా ఆర్య‌వైశ్య సంఘం, హిందూధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ స‌మితి సంయుక్త ఆధ్వ‌ర్యంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌గ‌రంలోని పున్న‌మీఘాట్‌లో ఆదివారం సాయంత్రం మృత్తికా (మ‌ట్టి) శివ లింగానికి నిర్వ‌హించిన మ‌హా రుద్రాభిషేకం ఆధ్యాంతం నేత్ర‌ప‌ర్వంగా సాగింది.

అమ్మ చారిట‌బుల్ ట్ర‌స్ట్ (గుంటూరు) ఆధ్వ‌ర్యంలో అమ్మ ఆశ్ర‌మం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామి (బాబాగారు), ఆశ్ర‌మ సేవ‌కులు పాల్గొని మ‌హా శివునికి పుణ్య న‌దీ జాలాలు, 250 ర‌కాల ద్ర‌వ్యాలు, విశేష‌మైన పుష్పాలు, విభూది, ప‌సుపు, కుంకుమ‌, రుద్రాక్ష‌లు, అన్నం, ప‌న్నీరు, నెయ్యి, పాలు, పంచామృతాలు, పెరుగు, త‌మ‌ల‌పాకులు, పండ్లు, వివిధ ర‌కాల పుష్పాల‌తో గంట పాటు నిరాంటంకంగా నిర్వ‌హించిన అభిషేకాలు వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌ను త‌న్మ‌య‌త్వం చేశాయి.

కైలాస‌మే భువికి దిగి వ‌చ్చిందా… సాక్షాత్తుగా ఆ ప‌ర‌మేశ్వ‌రుడే విచ్చేసి త‌మ‌ను అనుగ్ర‌హించాడా అన్న రీతిలో సాగిన రుద్రాభిషేకాన్ని తిల‌కించిన భ‌క్తులు పుల‌కించిపోయారు. అభిషేకాలు జ‌రుగుతున్నంత‌సేపు త‌మ‌ను తాము మ‌ర‌చిపోయి హ‌ర‌..హ‌ర మ‌హాదేవ… శంభో..శంక‌రా… ప‌ర‌మేశ్వ‌రా.. పాహిమా.. పాహిమాం.. అంటూ నిన‌దించారు.

అభిషేకాలు అనంత‌రం స్వామివారిని ప‌సుపు, కుంకుమ‌, విభూదితో శోభాయ‌మానంగా అలంక‌రించి దూప‌దీప నైవేద్యాలు స‌మ‌ర్పించి మ‌హా హార‌తిని గావించారు. రుద్రాభిషేకం, మ‌హా భ‌స్మాభిషేకం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక చింత‌న పెంపొందించడంతో పాటు లోక క‌ళ్యాణార్థం మ‌హా శివునికి రుద్రాభిషేకం న‌య‌న మ‌నోహ‌రంగా నిర్వ‌హించడం జ‌రిగింద‌న్నారు.

రాష్ట్రం సుభీక్షంగా ఉండాల‌ని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌న‌లో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రికీ చేరువ కావాల‌ని ఆకాంక్షించారు. మ‌హా రుద్రాభిషేకం, మ‌హా భ‌స్మాభిషేకం వంటి మ‌హోత్త‌ర‌మైన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా, నేత్ర‌ప‌ర్వంగా నిర్వ‌హించిన అమ్మ ఆశ్ర‌మం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామిని అభినందించారు.

మ‌హా శివునికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన కార్తీక‌మాసం సంద‌ర్భంగా పున్న‌మీ ఘాట్‌లో రుద్రాభిషేకం నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా రుద్రాభిషేకం అనంత‌రం నిర్వాహ‌కులు భ‌క్తుల‌కు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. రుద్రాభిషేకం అనంత‌రం అమ్మ ఆశ్ర‌మం సేవ‌కులు మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో దైవ‌భ‌క్తితో పాటు దేశ‌భ‌క్తి కూడా పెంపొందాలని అప్పుడే మాన‌వ జ‌న్మ‌కు సార్థ‌క‌త ఏర్ప‌డుతుంద‌న్నారు.

నింగికెగిరిన జాతీయ జెండా వెనుక నేల‌కొరిగిన సైనికులు, స‌మ‌ర‌యోధులు అనేక మంది త్యాగ‌ధ‌నుల‌ ప్రాణాలు ఉన్నాయ‌ని మ‌రువ‌కండి అంటూ సూచించారు. ఆ త్యాగ‌మూర్తుల‌కు మ‌ర‌ణ‌మే లేద‌ని చాటేలా ప్ర‌తి ఇంటా జాతీయ జెండా ఉండేలా దీక్ష చేప‌ట్టి దేశం ప‌ట్ల మ‌న బాధ్య‌త‌ను నిరూపించుకోవాల‌ని సూచించారు.

అనంత‌రం జాతీయ గీతంతో కార్య‌క్ర‌మాన్ని ముగించారు. భ‌క్తులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి రుద్రాభిషేకాన్ని తిల‌కించారు.  కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, జోగి ర‌మేష్‌, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.