సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి : పవన్ కళ్యాణ్

మాతృభాషను ఏ విధంగా పరిరక్షించుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‍ను చూసి నేర్చుకోవాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న వైసీపీ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. 
 
స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందని నిలదీశారు. మాతృభాషను ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఏపీ పాలకులకు హితవు పలికారు. 
 
తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ పరిరక్షించుకుంటున్న వైనం వైసీపీ నాయకత్వానికి ఓ పాఠం వంటిదన్నారు. మాతృభాష మనుగడ కోసం 2017 తెలుగు మహాసభల్లో 'తొలి పొద్దు' పేరుతో 442 మంది కవులు రాసిన రచనలతో ఓ పుస్తకం కూడా విడుదల చేశారని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
 
అలాగే, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తనదైనశైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను 2003లో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో మూడు నిమిషాల పాటు ఒక్క ఇంగ్లీషు పదం కూడా దొర్లకుండా మాట్లాడాలని పోటీ పెట్టానని, ఈ పోటీలో ఏపీలోని ఏ ప్రాంతంలో కూడా ఒక్కరు కూడా గెలవలేకపోయారని వెల్లడించారు. ఈ నిజాన్ని తాను ఎవరి కళ్లలోకి చూసి చెప్పమన్నా చెబుతానని ధీమా వ్యక్తం చేశారు.