ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (17:53 IST)

చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న రోజే హోదా కనుమరుగైంది!

కొన్ని కోట్ల మంది గుండెల్లో పెట్టుకున్న జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా చంద్ర‌బాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలని గతంలో చంద్రబాబు అడగలేదా? అని ప్రశ్నించారు. 
 
 
‘‘ఎంపీల రాజీనామా అంటున్న చంద్రబాబుకు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌, వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించిన ఘటన గుర్తు లేదా అని ప్ర‌శ్నించారు. గతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో  రూ.వందల కోట్లు పక్కదారి పట్టించేలా షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారని మంత్రి క‌న్న‌బాబు ఆరోపించారు. అమరావతి కోసం ఊరేగింపులు, బంద్‌లు తమ బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడానికి చంద్రబాబు చేయిస్తున్నార‌ని, ఏపీకి ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీ ప్రభుత్వానికి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మా ప్రభుత్వానికి సుద్దులు చెబుతారా? అని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.
 
 
చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న రోజే హోదా కనుమరుగైంద‌ని, ఓటీఎస్‌ ద్వారా పేదలకు హక్కు కల్పిస్తుంటే చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నార‌ని క‌న్న‌బాబు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ విక్రయం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, ఆయన సీఎంగా ఉన్నప్పుడే గోదావరి ఎరువుల ప్లాంట్‌ను అమ్మేశార‌ని, స్టీల్‌ ప్లాంట్‌ను విక్రయిస్తామని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమేంటి? అని ప్ర‌శ్నించారు. 
 
 
పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ ప్రారంభిస్తే ఆయన కుమారుడు జగన్‌ దానిని పూర్తి చేస్తార‌ని మంత్రి తెలిపారు. 1.30లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగం ప్రబలిపోయిందని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమ‌ని, ఇప్పటితో పోల్చితే తెదేపా హయాంలో 5శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేద‌ని ఎద్దేవా చేశారు. విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు ఇచ్చినా దాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశార‌ని ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ దీక్ష చేస్తే మంచిదేన‌ని, దానికి బదులు మోదీని క‌లిసి డిమాండు చేయాల‌ని సూచించారు.