ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (07:55 IST)

ప్రభుత్వ చర్యలవల్ల ముస్లిం కుటుంబం బలైంది: ఎన్.ఎమ్.డీ. ఫరూక్

నంద్యాలలో రైలుకిందపడి ఆత్మహత్యచేసుకున్నఅబ్దుల్ సలాంని, అతనికుటుంబసభ్యులను పోలీసులు దారుణంగా హింసించారని, బంగారం దొంగతనం చేశాడంటూ, చేయనినేరాన్ని అతనిపై మోపి, తీవ్రంగా వేధింపులకు గురిచేశారని, దాదాపు 70రోజులవరకు పోలీస్ స్టేషన్లో ఉంచి నానారకాలుగా హింసించారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఎన్.ఎమ్.డీ. ఫరూక్ తెలిపారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఇంతజరిగాక బెయిల్ పై బయటకు వచ్చి, జీవనోపాధి కోసం ఆటోనడుపుకుంటున్న సలాంని, తిరిగి వేధించడం ప్రారంభించారని, అతని ఆటోలో ఎక్కిన ప్రయాణీకుడికి చెందిన రూ.70వేలసొమ్ము పోయిందనే నెపంతో మళ్లీ హింసించారన్నారు. సలాంతో పాటు అతనిభార్యనికూడా వేధించారని, చివరకు ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

పోలీసుల వేధింపులు తట్టుకోలేక, చివరకు పిల్లలతో సహా సలాం దంపతులు, రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారన్నా రు. సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి ముమ్మాటికీ ప్రభుత్వమే కారణమని ఫరూక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జరిగిన ఘటనకు గాను, స్థానిక ఎస్సై, మరో కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.

సలాం భార్యని పలురకాలుగా పోలీసులు వేధించారని, ఆ కుటుంబం చావుకు కారకులైన పోలీసులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని  మాజీమంత్రి డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు నిరసనగా నేడుపలుచోట్ల ధర్నాలు, ర్యాలీలు జరిగాయని, ఇంతజరుగుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. 

రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందన్న మాజీమంత్రి, సలాం బంధువులను పరామర్శించడానికి నేడు ప్రభుత్వం తరుపున వచ్చిన డిప్యూటీ సీఎం, ఏవిధమైన హామీఇవ్వకుండానే వెళ్లిపోయాడన్నారు. ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్లాడో కనీసం ఆయనకు అయినా తెలుసునా అని మాజీమంత్రి ప్రశ్నించారు.

సలాం కుటుంబ బలవన్మరణంపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని, వారి చావులకు కారకులైన పోలీసులను, వైసీపీ నేతలు, కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని ఫరూక్ డిమాండ్ చేశారు. దోషులైన ప్రతిఒక్కరినీ చట్టపరంగా శిక్షించేవరకు, సలాం కుటుంబం కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. తూతూమంత్రంగా ఎస్సైని, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశామంటే కుదరదని, అసలు దోషులెవరో తేల్చి, వారినికూడా కఠినంగా శిక్షించాలని ఫరూక్ డిమాండ్ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా  జరిగిన దారుణంపై స్పందించి, ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.  ఈప్రభుత్వం వచ్చాక ముస్లింల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని, వారికోసం ఒక్కసంక్షేమ కార్యక్రమాన్ని కూడా వైసీపీప్రభుత్వం చేయలేదన్నారు. జగన్ ప్రభుత్వం  ఎక్కడా, ఎవరికీ రూపాయికూడా ఇచ్చింది లేదన్నారు. టీడీపీ హాయాంలో షాదీఖానాల నిర్మాణం, రంజాన్ తోఫా, దుల్హన్ వంటి అనేక పథకాలు అమలయ్యాయన్నారు.

ఈనాడు ముస్లింలు పెళ్లిళ్లు చేసుకుంటే రూపాయికూడా రావడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలపై దాడులు జరుగుతుంటే, జగన్ కరపత్రిక అయిన సాక్షిలో మాత్రం ముస్లింలు సంతోషంగా ఉన్నారని సిగ్గులేని రాతలు రాస్తున్నారని ఫరూక్ మండిపడ్డారు. ముస్లింలపై జరిగే దారుణాలు, ఆకృత్యాలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు.

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించి, దోషులను శిక్షించేవరకు ఈప్రభుత్వాన్ని నమ్మేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ సలాం కుటుంబానికి బాసటగా నిలవాలని, జరిగిన మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఫరూక్ డిమాండ్ చేశారు.  రేపటి నుంచి ప్రభుత్వ తీరుకి నిరసనగా ముస్లింలంతా ధర్నాలు నిర్వహించాలన్నారు.

జరిగిన దారుణాన్ని పార్టీఅంశంగానో, రాజకీయ కోణంలోనో చూడకుండా, ముస్లింలకు జరిగిన అన్యాయంగా భావించాలని, జగన్ ప్రభుత్వతీరుని ఎండగడుతూ, సలాం కుటుంబానికి జరిగిన అన్యాయంపై అందరూ సంఘటితంగా పోరాడాలని, ప్రతి ముస్లింకి సలామ్ చేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నానని ఫరూక్ పత్రికాముఖంగా ముస్లింలకు విన్నవించారు.