బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (14:24 IST)

గౌర‌వంగా బ‌తికే న‌న్ను... క్యారెక్ట‌ర్ చంపేస్తారా? వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు

బూతులు తిట్టారు.... అవి భ‌రించాం.... చివ‌రికి నా భార్య గురించి కూడా త‌ప్పుగా మాట్లాడే ఇలాంటి కౌర‌వ స‌భ‌లో నేనుండాలా అంటూ, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఉద్విగ్న భ‌రితుల‌య్యారు. నా భార్య‌ను కూడా నిందిస్తారా అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. అసెంబ్లీలో అవ‌మాన‌క‌రంగా భావించి, వాక్ అవుట్ చేసిన చంద్ర‌బాబు, నేరుగా త‌న నివాసానికి చేరుకుని, అక్క‌డ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. 
 
 
కుప్పం ఎన్నిక‌ల తర్వాత మా నాయ‌కులు బి.ఎ.సి. కి వెళితే, మీ నాయ‌కుడిని అసెంబ్లీకి ర‌మ్మ‌నండి, చూడాలి అంటూ సీఎం జ‌గ‌న్ అవ‌హేళ‌నగా మాట్లాడారు... అయినా, మేం ప‌ట్టించుకోలా... ఇపుడు నా భార్య‌ను కూడా నిందించి, క్యారెక్టర్ అసాసినేష‌న్ చేసే ప‌రిస్థితికి వ‌చ్చారు. అనేక మంది నాయ‌కుల‌తో క‌ల‌సి పనిచేశా. విమ‌ర్శలు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకున్నాం. ఎన్నిక‌ల్లో ఒక్కోసారి గెలిచాం, మ‌రోసారి ఓడిపోయాం. నేను ఎపుడూ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ వ్య‌క్తిని అవ‌మాన‌ప‌ర‌చ‌లేద‌ని చంద్ర‌బాబు చెప్పారు. నా భార్య‌ను అనేస‌రికి త‌ట్టుకోలేక పోయానంటూ, వెక్కి వెక్కి ఏడ్చారు. 
 
 
నేష‌న‌ల్ ఫ్రంట్ లో వాజ్ పేయి, జ్యోతి బ‌సు, క‌రుణానిధి, బిజుప‌ట్నాయ‌క్, చండ్ర రాశేశ్వ‌ర‌రావు లాంటి హేమా హేమీల‌తో ప‌నిచేశాన‌ని, గెలుపు ఓట‌ముల‌ను స్పోర్టివ్ గా తీసుకుని ముందుకెళ్లాం అని చెప్పారు.  రాజకీయాల్ని ప్ర‌జ‌ల కోసం చేశాం. హైద‌రాబాదులో అభివృద్ధి ప్ర‌జ‌ల కోసం చేశాం. ఇపుడు ఈ రాష్ట్రంలో కియా, అమ‌రావ‌తి, పోల‌వ‌రం చేసి గ‌ర్వంగా ఫీల్ అయ్యాం. క్లింట‌న్, మ‌లేసియా, సింగ‌పూర్ ప్ర‌ధానులు వ‌చ్చారు. అంద‌రితో గౌర‌వం పొందామ‌ని, ఇపుడు ఇలా కౌర‌వ స‌భ‌లో నింద‌లు ప‌డాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  
 
 
మా మిసెస్ ఎపుడూ రాజ‌కీయాల్లోకి రాలేదు... ఆస‌క్తి లేదు. నేను సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా ఉన్నా, ఆమె ఎపుడూ ప్రోటోకాల్ త‌ప్ప‌ద‌న్న‌పుడు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేది ఆమె. మా పార్టీ నాయ‌కులు చాలా మంది ఆవిడ‌కు తెలియ‌దు. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం ఒక‌రికి సాయం చేయ‌డం, న‌న్ను ప్రోత్స‌హించ‌డం త‌ప్ప వేరే ప‌ని ఆమెకు తెలియ‌దు. అలాంటి వ్య‌క్తిని కూడా క్యారెక్ట‌ర్ చంపే విమ‌ర్శ‌లు చేస్తున్నారు అని రోదించారు. 
 
 
వాయిపేయ ప్ర‌ధానిగా ఉంటే, ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ల‌డం ఒక అర‌గంట లేట్ అయినా నా కోసం వెయిట్ చేశారు. ఆంధ్ర సీఎం ఎపుడూ వ్య‌క్తిగ‌తంగా ఏమీ అడ‌గ‌రు, ప్ర‌జ‌ల కోస‌మే అడుగుతార‌ని ఆయ‌న అన్నారు. అలా మేం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేశాం త‌ప్ప స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం కాదు. కానీ, ఇపుడు నిండు కౌర‌వ స‌భ‌లో ద్రౌప‌దిని పాండ‌వుల స‌మ‌క్షంలో అవ‌మానం చేశారు. రామాయ‌ణంలోనూ రాక్ష‌సులు ఏం చేశారో చూసాం. భ‌స్మాసురుడు దేవ‌త‌ల్ని ప్రార్ధించి, ఈశ్వ‌ర వ‌రంతో నెత్తిపైన చేయి పెట్ట‌బోతే, మోహిని అవ‌తారంలో కృష్ణుడు భ‌స్మాసురుడిని చంపాల్సి వచ్చింద‌ని పేర్క‌న్నారు. 
 
 
ఈ రోజు ప్ర‌జ‌లు 151 సీట్లు వారికి ఇచ్చారు.  ఒక‌సారి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మా త‌ల్లిని దూషించాడు. చివ‌రికి క్ష‌మించ‌మ‌ని అడిగాడు. స్పీక‌ర్ కి నేను ఒక అనౌన్స్మెంట్ చెప్పాల‌ని టైమ్ ఇవ్వాల‌ని అడిగా, కానీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఇవ్వ‌లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన‌వి త‌ప్పు అని కూడా అన‌రు. ఇలాంటి ప‌రిస్థితిపై త‌మ్మినేని కూడా ఆలోచించుకోవాల‌న్నారు. తాను అంతా ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటాన‌ని, ప్ర‌జ‌లు మ‌ళ్లీ గెలిపిస్తేనే తిరిగి అసెంబ్లీకి వెళ‌తాన‌ని చంద్ర‌బాబు స్పష్టం చేశారు.