శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (17:06 IST)

నారా లోకేష్ చెప్పినట్లు ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయండి.. వైకాపాకు మాత్రం?

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహారీగా సాగుతోంది. 2019 ఎన్నికలు రాజకీయ పార్టీలకు డూ ఆర్ డై పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నాయకులు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. నేతలు ప్రచార సభలతో ఠారెత్తిస్తున్నారు. ఈ సభల్లో నేతలు స్పీచ్‌లతో ఊదరగొడుతున్నారు. 
 
రాజకీయ నేతల్లో తాను ఎప్పుడూ ఓ భిన్నమైన వ్యక్తి అంటూ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి నోరు జారారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుండి బరిలో దిగారు. అయితే గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ప్రచారం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బాబు మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తప్పకుండా టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు.
 
టీడీపీ కార్యకర్త ఒకరు లోకేశ్ అన్నా ఎన్నికలు తొమ్మిదో కాదు, పదకొండు అని అనడంతో లోకేశ్ కవర్ చేసుకోలేక తర్జనభర్జన పడ్డారు. అయితే లోకేశ్ చేసిన ఈ తప్పుడు ప్రకటన పట్ల వైసీపీ, జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో లోకేష్ వీడియోని పోస్ట్ చేసి సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో కామెంట్‌లు చేసారు. లోకేశ్ చెప్పినట్లుగా ప్రజలంతా ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయాలన్నారు. అయితే ఏప్రిల్ 11న మాత్రం వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్‌కు ఓటేసి గెలిపించాలని వ్యంగ్యంగా ట్వీట్ చేసారు.