శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (12:25 IST)

అపుడు 'అన్నయ్య'.. ఇపుడు 'తమ్ముడు'... జనసేన కూడా మరో ప్రజారాజ్యమేనా?

అపుడు అన్నయ్య చిరంజీవి, ఇపుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకే తరహా నిర్ణయం తీసుకున్నారు. గత 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి... 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. అందులో ఒకటి తిరుపతి కాగా, రెండోది పాలకొల్లు. ఈ రెండు స్థానాల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందగా, ఆయన సొంతూరు అయిన పాలకొల్లులో మాత్రం చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 
 
ఇపుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పేరుతో పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. వచ్చే నెల 11వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తుపెట్టుకుని పోటీ చేయనున్నారు. ఇప్పటికే అనేక మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. కానీ, తాను పోటీ చేసే స్థానాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. పోటీ చేసే స్థానాల పేర్లను పార్టీ కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. మరికొన్ని గంటల్లో తాను పోటీ చేసే స్థానాల పేర్లను వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. 
 
గతంలో చిరంజీవి తీసుకున్నట్టుగానే ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం తరహాలోనే జనసేన కూడా కనుమరుగైపోతుందని వారు అంటున్నారు. అలాగే, పవన్ కూడా ఏదేని ఒక స్థానంలో గెలుపొందుతారని మరో స్థానంలో ఓడిపోతారని అంటున్నారు. మొత్తంమీద చిరంజీవి తరహాలోనే పవన్ నిర్ణయం తీసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.