1+1=2 కాదు 1+1=11 ఇది లక్ష్మీనారాయణ లెక్క : జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ

pawan kalyan - jd
Last Updated: ఆదివారం, 17 మార్చి 2019 (12:35 IST)
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి. లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఆదివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌పై లక్ష్మీనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. భారీగా డబ్బులు వెచ్చించకుండా రాజకీయాల్లో గెలవలేమన్న అభిప్రాయం ప్రస్తుత సమాజంలో ఉందన్నారు. కానీ, డబ్బులు లేకుండానే రాజకీయం చేయొచ్చని నిరూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఓ ప్రొఫెసర్‌లో జ్ఞానం ఉంటుందనీ, మరికొందరిలో ఆత్మ విశ్వాసం ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంకొందరు వ్యక్తులకు ప్రజాధారణ ఉంటుందని అన్నారు. ఈ మూడు లక్షణాలున్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని, అందుకే ఆయన కింద పని చేసేందుకు సిద్ధమైనట్టు చెప్పారు.

ముఖ్యంగా, సాధారణంగా ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు అంటారు.. కానీ, తన లెక్క ప్రకారం ఒకటి ప్లస్ ప్లస్ అంటే పదకొండు అని చెప్పారు. అందువల్ల 11 మంది కలిసి పార్టీని ముందుకు నడిపిస్తూ సమాజానికి మంచి చేద్ధామని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే, గతంలో పవన్ పలుమార్లు చెప్పినట్టుగా సినీపరిశ్రమలో బ్రహ్మాండంగా నగదు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ చేసేందుకు దాన్ని పవన్ వదులుకున్నారన్నారు. పవన్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చివరగా దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఏంటో చూపిద్దాం.. జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.దీనిపై మరింత చదవండి :