రమ్య హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష: ఎస్.సి. కమిషన్
గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని జాతీయ ఎస్.సి. కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్ దేర్ చెప్పారు.
గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పర్యటించింది. రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ బృందం నిశితంగా పరిశీలించింది. కొద్దిసేపు రమ్య కుటుంబ సభ్యులతో బృందం సభ్యులు మాట్లాడారు. అనంతరం గుంటూరు అతిథి గృహంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు.
రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్ దేర్ చెప్పారు. రమ్య కుటుంబ సభ్యులు, వివిధ వర్గాల నుండి సమాచారాన్ని తీసుకున్నామని, రమ్య హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్న చెప్పారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హాల్ దేర్ తెలిపారు.
మరో పక్క టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా జాతీయ ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిశారు. తమ తమ అభిప్రాయాలను కమిషన్ ఎదుట వెల్లడించారు.