1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (08:14 IST)

నవ్యాంధ్రలో 25 జిల్లాలు? జగన్ ప్లాన్... పవన్‌కు ఆహ్వానం

నవ్యాంధ్ర రాష్ట్రం 25 జిల్లాలుగా విడిపోనుంది. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న 25 లోక్‌సభ స్థానాలను ఒక్కో జిల్లాగా చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇపుడు బంపర్ మెజార్టీతో వైకాపా అధికారంలోకి వచ్చింది. దీంతో నవ్యాంధ్రలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయతో ఆయన ఉన్నారు. 
 
అదేవిధంగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 25 మందికి జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నవ్యాంధ్రలో 13 జిల్లాలు ఉన్న విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ మేరకు వారిద్దరికీ ఆయన స్వయంగా ఫోను చేసి ఆహ్వానించినట్టు వైకాపా వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరిలో చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా జగన్ ఆహ్వానించిన విషయం తెల్సిందే. అయితే, చంద్రబాబు రాకపై టీడీపీ ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.