ఇళ్ల స్థలాల పేరుతో అడవుల ధ్వంసం.. ఏపీకి ఎన్జీటీ షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత బోర్డు (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తేరుకోలేని షాకిచ్చింది. ఇళ్ళ స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ జనసేన పార్టీ నేత ఒకరు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్జీటీ.. విచారణ జరిపి... ఐదు కోట్ల రూపాయల అపరాధం చెల్లించాలంటూ ఆదేశించింది. సీఆర్‌జడ్-1 పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పేర్కొంది.
కాకినాడ జిల్లా శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ విశాఖపట్టణానికి చెందిన జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ, రాజమహేంద్ర వరానికి చెందిన డి.పాల్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపించిన ఎన్జీటీ.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్‌జడ్-1 పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాల ప్రాజెక్టును చేపట్టవద్దని ఆదేశించింది.
ముఖ్యంగా, మడ అడవుల ఉనికి, సంరక్షణపై ప్రభావం చూపేలా భూ వినియోగ చట్టాన్ని ప్రయోగించ వద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆ సొమ్మును వసూలు చేయాలని సూచించింది.