ఏపీ సరిహద్దు చెక్‌పాయింట్లు తొలగించడం లేదు: కొవిడ్ టాస్క్‌ఫోర్స్
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పాయింట్లను రేపటి నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను తొలగించే నిర్ణయమేదీ ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొవిడ్ ఆర్డర్ 55 ప్రకారం చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో మరికొంత కాలం ప్రవేశాలను నియంత్రిస్తామన్నారు.
ఎవరైనా రాష్ట్రంలోకి రావాలంటే స్పందన యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవాల్సిందేనని చెప్పారు. అలాగే వచ్చే వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఎక్కువ కరోనా కేసులున్న 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారు 7 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణకు బస్సులు నడపడానికి ఆ రాష్ట్రం ఇంకా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.
అక్కడి నుంచి అనుమతి లభిస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని కృష్ణబాబు వివరించారు.