మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (11:36 IST)

ఉల్లి కోసం పాట్లు : క్యూలో నిల్చోలేక ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

దేశవ్యాప్తంగా ఉల్లి పాట్లు ఇప్పట్లో తీరేలా లేదు. ఉల్లిపాయల కోసం జరుగుతున్న పోరాటంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రలో ఈ ఘటనల ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో సబ్సీడీ ఉల్లిపాయల కోసం తొక్కిసలాట జరిగింది. ఇపుడు కృష్ణా జిల్లా గుడివాడలో ఉల్లి కోసం క్యూలో నిలబడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, ఉల్లి కోసం క్యూలో నిల్చున్న ఓ వృద్ధుడు టెన్షన్‌ తట్టుకోలేక గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఉల్లి ధర ఆకాశయానంతో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ఉల్లి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 
 
కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో సోమవారం ఉదయం ఉల్లి అమ్మకాలు జరుగుతుండటంతో సాంబయ్య అనే వృద్ధుడు క్యూలో నిల్చున్నాడు. ఉదయం నుంచి క్యూలో నిల్చోవడం, ఉల్లి దొరుకుతుందో లేదో అన్న ఆందోళనకు గురికావడంతో కొన్ని గంటల తర్వాత క్యూలోనే కుప్పకూలిపోయాడు. 
 
అలా స్పృహతప్పి పడిపోయిన అతన్ని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.