శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (16:56 IST)

యుద్ధం గురించి అప్పుడే చెప్పారు.. పవన్ కల్యాణ్.. వాడేసుకుంటున్న పాకిస్తాన్

ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు బీజేపీ నేతలు యుద్ధం చేయడానికి వెనకాడబోయేది లేదంటూ ప్రకటనలు చేస్తుండటం, మరి కొంతమంది బీజేపీ నేతలు యుద్ధానికి ముడిపెట్టి ఎన్నికల్లో మాదే విజయం అని చెబుతుండటంతో చాలా మంది పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 
 
లోక్‌సభ ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని దాదాపు రెండేళ్ల క్రితమే కొందరు నేతలు తన వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ ఈ వ్యాఖ్యలు చేసారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతోందని రెండేళ్ల క్రితం నాకు చెప్పారు, సరిగ్గా ఈనాటి పరిస్థితులు కూడా దాదాపు అలాగే కనిపిస్తున్నాయి, దీన్ని బట్టి మన దేశంలో ఎటువంటి పరిస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన మండిపడ్డారు.
 
ఇది మంచి పరిణామం కాదని చెప్పిన జనసేనాని మన జవాన్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే బీజేపీకి మిత్రుడిగా ఉన్న జనసేనానే ప్రత్యక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్షాల నుండి మద్దతు లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాకిస్తాన్ డాన్ పత్రిక ప్రత్యేకంగా రాయడం గమనార్హం. అలా భాజపాను కౌంటర్ చేసేసింది పాక్.