శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 9 జులై 2018 (18:43 IST)

పవన్ ఓ సైకో... మీ అన్న చిరు మాదిరిగా నీకూ అవమానం.. ఎవరు?

అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తను సంధించిన 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ డిమాండ్ చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌ల

అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తను సంధించిన 21 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ డిమాండ్ చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ తన స్థాయిని మరిచి, సీఎం చంద్రబాబునాయుడుపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. 
 
రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు పదవీకాంక్ష ఉందనడం సరికాదన్నారు. చిరంజీవి మాదిరిగా ప్రజల చేతిలో అవమానం గురికాక తప్పదని హెచ్చరించారు. సైకోలా మారుతూ, సీఎం చంద్రబాబుపైనా, మంత్రి లోకేష్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. చర్చకు రావాలంటూ సీఎం చంద్రబాబును పిలిచేస్థాయి పవన్ కాదన్నారు. టీడీపీ కార్యకర్తే ఆయనతో మాట్లాడితే చాలన్నారు. సీఎంపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడానికే పవన్ తన పర్యటనను వినియోగించుకుంటున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి పట్ల పవన్ కల్యాణకు చిత్తశుద్ధి ఉంటే తాము అడిగిన 21 సమాధానాలు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
 
1. ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్‌ను కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది. రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకుండా నానబెడుతుంటే నరేంద్రమోడిని ఎందుకు ప్రశ్నించరు?
 
2. విభజన చట్టంలోని అంశాలను పూర్తి చేయకాం మొత్తం చేసేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే ఎందుకు పవన్ కేంద్రాన్ని ప్రశ్నించరు?
3. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఇచ్చిన రూ.350 కోట్లు ప్రధాని వెనక్కి లాగేసుకుంటే ఎందుకు ప్రశ్నించలేదు?
4. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు నాలుగేళ్లు అయినా ఇవ్వలేదు. ఈ పారిశ్రామిక కారిడార్ వస్తే వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. దీనిపైనా పవన్ ఎందుకు మోడిని ప్రశ్నించలేదు.
5. విశాఖ రైల్వే మెట్రో ప్రాజెక్టు ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?
6. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగు సహాయం ఇవ్వని కేంద్రాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించరు?
7.ఉత్తరాంధ్రలో గిరిజన యూనివర్శిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీని ఇంతవరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదని కేంద్రాన్ని పవన్ ఏనాడయినా ప్రశ్నించారా?
8. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై పవన్ వైఖరి ఎందుకు ఇంత వరకూ తెలియజేయలేదు. రైల్వేజోన్ కోసం తెలుగుదేశం ఎంపీలు దీక్ష చేపడితే కనీసం సంఘీభావం తెలపకుండా విమర్శలకు దిగడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి?
9. ఉత్తరాంధ్రాకు బుంధేల్ ఖండ్ ప్యాకేజీని ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్న కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు?
10. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీ కరణ చేస్తానన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించరు?
11. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటే పవన్ ఎందుకు ఇంత వరకూ కేంద్రాన్ని ప్రశ్నించలేదు? దళితులు, మైనార్టీలపై బీజేపీ చేస్తున్న దాడులను ఎందుకు ఖండించలేదు.?
12. కాకరాపల్లి, సోంపేటలో భూములు ఇవ్వమన్న రైతులను వైఎస్ కాల్చి చంపితే ఎందుకు ప్రశ్నించలేదు?
13. వైఎస్ హయాంలో వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలను మానభంగం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు?
14. ఉత్తరాంధ్ర వెనకబాటుకు అసలు కారణం 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, వైఎస్ ప్రభుత్వాలే కారణం కాదా? వారిపైనా ఎందుకు విమర్శలు ఎక్కుపెట్టలేదు?
15. జేఎఫీసీ కొత్తగా చెప్పింది ఏమిటి? టీడీపీ ప్రభుత్వం చెబుతున్న అంశాలనే చెప్పిందిగా?
16. రూ.70 వేల కోట్లు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని మీరు నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ క మిటీ తేల్చిన విషయం వాస్తవం కాదా? ఈ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదు?
17. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గిరిజనులు, రైతులు పునరావాసానికి పోలవరంలో అంచనా వ్యయం రూ.33 వేల కోట్లకు చేరాయి. వాటిని ఆమోదించాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదు?
18. ప్రత్యేక హోదాను నిరాకరించిన బీజేపీని కర్నాటక ఎన్నికల్లో ఓడించమని తెలుగు ఓటర్లకు ఎందుకు పిలుపివ్వలేదు?
19. బెంగళూరులో ఏపీ ఎన్జీవో నాయకులు ఓ హోటల్‌లో మీటింగ్ పెట్టినప్పుడు వారిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే ఎందుకు ఖండించలేదు?
20. తిరుమల వెంకటేశ్వరుడికి లేని వజ్రం విదేశాలకు తరలిపోయిందంటూ తిరుపతి కేంద్రంగా రమణదీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావుల ద్వారా మత చిచ్చు రెచ్చగొట్టడానికి బీజేపీ కుట్రలు చేస్తే దాన్ని ఎందుకు ఖండించలేదు?
21. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అవినీతి కేసులలో ఏడాదిలోగా తీర్పు వెలువరించాలి. కాని జగన్ కేసును నత్తనడకన జరుపుతుంటే దానిపై ఎందుకు మాట్లాడడంలేదు? జగన్, పవన్, మోడీ కుమ్మక్కుకు ఇవన్నీ రుజువు కావా?
 
రాష్ట్రాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే పవన్ కల్యాణ్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ డిమాండ్ చేశారు. లేకుంటే చిరంజీవి మాదిరిగా ఆయనకు ప్రజల చేతిలో అవమానం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయనతో చేతులు కలిపి, కేంద్రం పోరాటానికి సిద్ధం కావాలని పవన్‌కు ఆయన హితవు పలికారు.