సాధువులు - సిద్ధుల భూమి తమిళనాడు.. విజయ్‌కు పవన్ విషెస్
తమిళగ వెట్రి కగళం తొలి మహానాడును విజయవంతంగా నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
గత ఫిబ్రవరిలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే)ను ప్రకటించిన విజయ్... ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని తన రాజకీయ పంథాను చాటారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీతో సిద్ధాంతపరంగా విభేదిస్తామని, డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తామని తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని చెబుతూ, పొత్తులకు తాము వ్యతిరేకం కాదన్న సంకేతాలను పంపించారు.
ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. "సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన విజయ్‌గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు" అంటూ విషెస్ తెలియజేశారు.
గతంలో పవన్ కల్యాణ్ సైతం ఇదే రీతిలో సినీ రంగం నుంచి వచ్చి పార్టీ పెట్టి, ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. అయితే, తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్ఎం పార్టీ ఎన్నోఏళ్లుగా తమిళ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో, విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.