ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

శ్రీ| Last Modified మంగళవారం, 23 జులై 2019 (22:19 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం మన దేశాన్ని అగ్ర దేశాల సరసన నిలిపింది. చంద్రయాన్ - 2 రాకెట్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామం. ఈ క్షణాలను ప్రతి భారతీయుడు సగర్వంగా గుర్తుపెట్టుకొంటాడు. జీఎస్‌ఎల్‌వీ ఎంకె3–ఎం1 రాకెట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా పంపించిన ఇస్రో శాస్త్రవేత్తలకు నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు తెలియచేస్తున్నాను అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

ఈ విజయం మనందరం గర్వించదగ్గది. పరిమిత బడ్జెట్‌తోనే చంద్రుడిపైకి రోవర్‌ను ప్రయోగించడంతో అన్ని దేశాలూ మన సాంకేతిక పరిజ్ఞానం వైపు ఆసక్తిగా చూడటం గొప్ప విషయం. చంద్రునిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, చంద్రుని పుట్టుక, నీరు, అక్కడి ఉపరితలం, ఇతర మూలకాల గురించి లోతుగా తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్ - 2తో అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం మరో మెట్టు ఎక్కింది.

రోవర్ చంద్రుణ్ని చేరుకొని అనుకున్న లక్ష్యం సాధిస్తుందన్న నమ్మకం ఈ విజయం మనకు కలిగించింది. మన శాస్త్రవేత్తలు అంతరిక్ష యానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.దీనిపై మరింత చదవండి :