గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (12:23 IST)

జనసేన గెలిచే తొలి సీటు అదేనన్న పవన్.. మరి అభ్యర్థి పేరేంటో చెప్పలేదే?

2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశ

2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లోనే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్నా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మిన్నకుండిపోయామని తెలిపారు.
 
గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా తాను టీడీపీకి మద్దతు తెలిపానని, తనకు ఏం చేస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ అడగలేదని, రాష్ట్ర యువతకి ఏం చేస్తారని అడుగుతున్నానని అన్నారు. అయితే పాయకరావుపేట జనసేన అభ్యర్థి ఎవరు? అనేదానిపై పవన్ క్లారిటీ ఇవ్వలేదు. 
 
శుక్రవారం పాయకరావుపేటలో పర్యటించిన పవన్, ఫ్లెక్సీలు కడుతూ ఇటీవల చనిపోయిన శివ-నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ర్యాలీలో ఆవేశంగా ప్రసంగించారు. పాయకరావుపేటలో విజయం మాదేనన్నారు. కానీ అభ్యర్థి పేరు ఖరారు కాకముందే విజయంపై ధీమా ఎలా కలుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 
 
పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. 1989-2014 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో ఒక్కసారి తప్పితే మిగతా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం అనిత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్నారు. అలాంటి ప్రాంతంలో జనసేన విజయం సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
 
మరోవైపు విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో పవన్‌ మాట్లాడుతూ... 2019లో కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచేస్తున్నా కొందరిపై కేసులు పెట్టట్లేదని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 
 
చట్టవ్యతిరేకంగా జరుగుతోన్న మైనింగ్‌ మీద రోజుకి రూ.6 లక్షలు సంపాదిస్తోన్న స్థానిక ఎమ్మెల్యేపై కేసులు పెట్టరని వ్యాఖ్యానించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్‌ కావాలన్నామని, అది వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించామని అది కూడా నెరవేరలేదని అన్నారు. యువతకి అండగా ఉందామని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.