పవన్ పర్యటనకు అనుమతి లేదు : నిర్వహించి తీరుతామంటున్న జనసేన

pawan kalyan
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 8 జనవరి 2021 (19:33 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించాలని భావించారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఆయన పర్యటనకు తొలుత అనుమతి ఇచ్చి.. ఆ తర్వాత రద్దు చేశారు. దీనిపై జనసేన మండిపడింది.

కాగా, తునిలో దివిస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ తుని నియోజకవర్గ ప్రజలు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తుని ప్రజలకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. అంతేకాదు, రేపు (జనవరి 9) తుని సమీపంలో కొత్తపాకల వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

అయితే, ఈ సభకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆఖరి నిమిషంలో అనుమతి నిరాకరించారని జనసేన పార్టీ వెల్లడించింది. పవన్ కల్యాణ్ సభను ఏ కారణాలతో నిర్వహిస్తున్నది, ఎందుకు నిర్వహిస్తున్నది ఎస్పీకి జనసేన నాయకులు ముందుగానే తెలియజేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు రక్షణ కావాలని కోరితే అందుకు ఎస్పీ సమ్మతి కూడా తెలిపారని జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కానీ, శుక్రవారం సాయంత్రం పవన్ కల్యాణ్ సభకు అనుమతులు రద్దు చేస్తున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైసీపీ ఆదేశాలను పాటిస్తున్నట్టుగానే భావిస్తున్నామని తెలిపారు.

కాగా, తీవ్ర కాలుష్యానికి కారణమయ్యే దివీస్ కంపెనీని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ప్రజలు ఆవేదన, నిస్సహాయత వ్యక్తం చేస్తుంటే శాంతియుతంగా వారి భావాలను అర్థం చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సభ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

కానీ పవన్ కల్యాణ్ సభకు పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏదేమైనా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపాకల వద్ద సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలుస్తామని ఉద్ఘాటించారు.

పోలీసులను అడ్డంపెట్టుకుని జనసేన కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులు కూడా తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ప్రజల పక్షాన పనిచేస్తున్నామని గుర్తెరగాలని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.దీనిపై మరింత చదవండి :