మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చు : ఆర్ఆర్ఆర్ వెల్లడి
అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల మూడో వారం అంటే 15వ తేదీ లోపు నోటిఫికేషన్ విడుదల కావొచ్చని వైకారపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై దేశ ప్రజలందరి దృష్టి నెలకొనివుందన్నారు. ఎన్నికల ప్రకటన కోసమే కోట్లాది మంది ఎదురు చూస్తున్నారన్నారు. తనకు తెలిసినంతవరకు ఈ నెల 15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని చెప్పారు. ఈ మేరకు తన వద్ద సమాచారం ఉందన్నారు. ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 25 మే 5వ తేదీల మధ్య ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కావాలో.. ప్యాలెస్‌లు నిర్మించే ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలవరం ఆపేస్తావా? అమరావతిలో రోడ్లు తవ్వస్తావా? నువ్వేమో రూ.500 కోట్లతో కొంప కట్టుకుంటావా? ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా? పోలవరం ఆగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణాలు అక్కడక్కడా కూలిపోయాయి. అమరావతి మొత్తం ఆగిపోయింది. జగన్ మనసు దోచిన స్థానిక ప్రతినిధి ఒకడున్నాడు అక్కడ. వాడు రోడ్లు తవ్వుకుపోతాడు. కంకర కంకరగా, మట్టికి మట్టిగా, రాళ్ళకు రాళ్లుగా దేనికది సెపరేటుగా అమ్ముకుంటాడు. ఈయన మాత్రం రూ.500 కోట్లతో కొంప కట్టుకుంటాడు. మనకు ప్రాజెక్టులు కట్టేవాడు కావాలా, లేక సొతంంగా ఉండటానికి ప్యాలెస్‌లు కట్టుకునేవాడు కవాలా? ప్రజలారా ఆలోచించండి అని రఘురామ పిలుపునిచ్చారు.