1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (09:17 IST)

సచివాలయంలో అడుగుపెట్టిన జగన్... 8.39 నిమిషాలకు ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోకి అడుగుపెట్టారు. శనివారం సరిగ్గా ఉదయం 8.39 గంటలకు ఆయన లోనికి ప్రవేశించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. 
 
నిజానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన సచివాలయానికి వస్తారని ఉద్యోగులంతా భావించారు. కానీ, ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఇపుడే ఆయన తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టారు. 
 
అనుకున్న ముహూర్తానికి సెక్రటేరియట్‌లోని తొలి బ్లాక్‌ మొదటి అంతస్తులో ఉన్న కార్యాలయంలో అడుగుపెట్టిన జగన్ ఉదయం 9.30 గంటలకు  అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే, ఉదయం 11:15 గంటలకు జరగనున్న ప్రొటెం స్పీకర్  శంబంగి చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు. 
 
అంతకుముందు సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన జగన్‌కు సచివాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తన నూతన కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డిని వేదమంత్రోచ్ఛారణలతో వేద పండితులు ఆశీర్వదించారు. సచివాలయంలో జగన్ బాధ్యతలు స్వీకరించారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. 8:50 గంటలకు వైఎస్ మొదటి సంతకం చేశారు.