మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లో ఉరిశిక్ష: జగన్

jagan in assembly
ఎం| Last Updated: మంగళవారం, 10 డిశెంబరు 2019 (06:51 IST)
ముఖ్యమంత్రి
జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడితే..సరైన ఆధారాలు చిక్కితే వారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. మహిళా భద్రత మీద అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో జరిగిన దిశ ఘటన పైన సీఎం స్పందించారు. దిశపైన అత్యాచారం చేసి..చంపేసిన ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి జగన హాట్సాఫ్ చెప్పారు. అదే విధంగా సంఘటన జరిగినప్పుడు స్పందించని మానవ హక్కుల సంఘం ఢిల్లీ నుండి హడావుడిగా విచారణ చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఇక, సోషల్ మీడియాలో మహిళల పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారి పైనా చర్యలు తీసుకుంటామని ఈ దిశగా కొత్త బిల్లును ఈ నెల 11న సభలో ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా..
దిశ సంఘటన పైన ఏపీ అసెంబ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఏపీలో మహిళల భద్రతకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావటం పైన ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయటంలో జరుగుతున్న కాలయాపన కారణంగా అసహనం పెరిగిపోతుందన్నారు. ఏపీలో ఇటువంటి ఘటనలకు పాల్పడితే..ఎవరికైనా భయం ఉండేలా కొత్త చట్టం తెస్తున్నామని ప్రకటించారు.

అందులో భాగంగా..ఘటన జరిగితే వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలన్నారు. మరో వారం రోజుల్లో కావాల్సిన అన్ని నివేదికలు పూర్తి చేసి..పూర్తిగా రెండు వారాల్లోగా విచారణ తో సహా ఆధారాలు సైతం సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఆ తరువాత రెండు వారాల్లోగా కేసు పైన విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చేలా చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. రెడ్ హ్యాండెడ్ గా కళ్లకు కనిపించే ఆధారాలు ఉంటే వారికి కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తామని సభలో ప్రకటించారు.

కేసీఆర్..తెలంగాణ పోలీసు హాట్సాఫ్..
దిశ హత్య కేసులో ఏ రకంగా స్పందించాలో తెలియలేదన్నారు. కానీ, ఎవరూ ఎవరినీ ఎన్ కౌంటర్ చేయాలని భావించరని..కానీ, న్యాయం జాప్యం అవుతన్న సమయంలో బాధితులకు ఉప శమనం కలగాల్సిన అవసరం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. కేంద్రం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిందితులకు నాలుగు నెలల్లోగానే శిక్ష పడాల్సి ఉందని..కానీ అది అమలు కావటం లేదన్నారు.

కేంద్రం సైతం ఇటువంటి చట్టాల మార్పు అవసరాన్ని గుర్తించాలని సూచించారు. దిశ ఘటన తరువాత ఆ నలుగురు నిందులకు ప్రజా డిమాండ్ మేరకు మరణ శిక్ష సరైనదే అని తన అభిప్రాయమన్నారు. ఆ నలుగురినీ ఎన్ కౌంటర్ చేయాలని ఎవరూ కోరుకోరని..వారు అత్యంత దారుణంగా ప్రవర్తించారని ఆందోళన వ్యక్తం చేసారు. వారిని ఎన్ కౌంటర్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి జగన్ సభా వేదికగా హాట్సాఫ్ చెప్పారు.

సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం..
ఇక, మహిళల పైన ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని..దీనిని సైతం నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం తప్పుడు పోస్టింగ్ లు.. వేధింపులకు గురి చేసేవి..అసభ్య పోస్టింగ్ లు పెడితే 354ఈ ప్రకారం కఠిన చర్యలు తీసుకొనేలా చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఘటన జరిగినప్పుడు బాధితుల తరపున మాట్లాడని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే మాత్రం ఢిల్లీ నుండి హడావుడిగా వస్తున్నారని వ్యాఖ్యానించారు. కోర్టులో సైతం ఇటువంటి కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా మహిళల భద్రతకు సంబంధించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే బిల్లును ఈ నెల 11న సభలో ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :