బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 ఆగస్టు 2020 (20:35 IST)

ఏపీ మహిళల దశ తిరుగుతోంది, ప్రభుత్వంతో రిలయన్స్‌ రిటైల్, జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం

ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్‌ రిటైల్, జియో, అల్లాన కంపెనీల అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రిలయెన్స్‌ రిటైల్, జియో, అల్లానా సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. మహిళా సాధికారిత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. చేయూత పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన 45- 60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు చేయూత పథకం ద్వారా సహాయం అందించాం. సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశాం.
 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూతను అందించాం. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా, స్థిరంగా వారికి ఏటా రూ.18,750 ఇస్తున్నాం. అర్హులైన వారందరికీ కూడా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తున్నాం. 23 లక్షల మహిళలకు ఈ ఏడాది సుమారు రూ.4,300 కోట్లు ఇచ్చాం. వచ్చే నెల ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
 
నాలుగేళ్ల పాటు దాదాపు 93 లక్షల మహిళలను ఆదుకుంటాం. చేయూత, ఆసరా రెండూ పథకాలు పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి పెద్దగా మేలు జరుగుతుంది. ఆసరా కింద ఏడాదికి రూ.6700 కోట్లు సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తున్నాం. దాదాపు రూ.11 వేల కోట్లు మహిళా సాధికారిత కోసం ఖర్చు చేస్తున్నాం. దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ముందడుగు వేస్తున్నాం.
 
ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌తో  అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు రిలయన్స్, అల్లానా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయి. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది మా ప్రయత్నం. మేం ఇచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలి. ఈ దిశగా మీ సహకారాన్ని కోరుతున్నాం అన్నారు సీఎం జగన్.
 
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వి. సుబ్రమణియం, మేనేజింగ్‌ డైరెక్టర్, రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వి. సుబ్రమణియం, మేనేజింగ్‌ డైరెక్టర్, రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ.. చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాంక్షిస్తూ మేం సమగ్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నాం. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు కూడా లబ్ధి పొందాలన్నది మా విధానం. ఏపీలో అరటి లాంటి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్‌ చేస్తున్నాం. దీని వల్ల మహిళలకు, మాకు పరస్పర ప్రయోజనం కలుగుతుంది
 
సీఎం శ్రీ వైయస్‌ జగన్ మాట్లాడుతూ.. మేం రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించాం. గ్రామ సచివాలయాల పక్కనే వాటిని ఏర్పాటు చేశాం. అక్కడే కియోస్క్‌లు కూడా పెడుతున్నాం. రైతులు ఆర్డర్‌ చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను క్వాలిటీ టెస్ట్‌ చేసి 48 గంటల్లో వారికి అందజేస్తున్నాం. అలాగే ఇ- క్రాపింగ్‌ కూడా చేస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలను కూడా ఆర్బీకేల ద్వారా కల్పించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ప్రతి గ్రామంలో గోడౌన్, మండలాల వారీగా కోల్డు స్టోరేజీలు ప్రారంభిస్తున్నాం. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పార్కులను నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నాం. అంతిమంగా ఇవన్నీ జనతా బజార్‌ వంటి వ్యవస్థలకు దారి తీస్తాయని అన్నారు.
అనంతరం వి.సుబ్రమణియం మాట్లాడుతూ... గోడౌన్లు, కోల్డు స్టోరేజీల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయి. దీనిపై ప్రభుత్వ అధికారులతో కూర్చుని ప్రణాళికలు వేసుకుంటాం అన్నారు. దామోదర్‌ మాల్, సీఈఓ, రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ... చేయూత ద్వారా మహిళలకు జీవనోపాధి మార్గాలను చూపెట్టే పద్ధతి బాగుంది. ఇది లబ్ధిదారుల కుటుంబాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
 
పంట చేతికి వచ్చిన తర్వాత సంరక్షించుకునే విధానాలపై దృష్టి మరింత మేలు చేస్తుంది, ఉత్పత్తులకు విలువను జోడిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రంగాల్లో ఏపీకి అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. 
 
ఇర్ఫాన్‌ అల్లానా, అల్లానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రమోటర్‌ లండన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ... చేయూత పథకంలో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు చాలా సంతోషం. మా దగ్గరున్న సాంకేతిక సహకారాన్ని, వ్యాపార అనుభవాన్ని పంచుతాం. రాష్ట్రంలోని పోర్టుల ద్వారా ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తాం. ఉత్పత్తులకు అదనపు విలువను జోడించాలి.
 
కొత్త తరహా ప్యాకేజింగ్‌ విధానాలు చాలా అవసరం. వీటన్నింటి విషయంలో మేం తగిన సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. చాలా పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. సీఎం దార్శినికత ప్రశంసనీయం.
 
సరైన భాగసాములను ఎంచుకున్నారు. ఆర్థికంగా బలమైన, అంకిత భావం ఉన్న కంపెనీల భాగస్వామ్యం మంచి ఫలితాలను అందిస్తుంది. ఏపీ నుంచి ప్రంపచ స్థాయి ఆహార ఉత్పత్తులు కచ్చితంగా వస్తాయి అని అన్నారు.
 
రిలయెన్స్‌ రిటైల్‌
మహిళల కిరాణా వ్యాపారానికి సహాయ సహకారాలు అందించనున్న రిలయన్స్‌ రిటైల్‌.
దుకాణాల నిర్వహణ, వ్యాపార సమర్థతను పెంచడంలో మహిళలకు శిక్షణ.
కిరాణా దుకాణాలు నడుపుతున్న మహిళలకు సరసమైన ధరలకే ఉత్పత్తులు అందించనున్న రిలయన్స్‌ రిటైల్‌.
 
జియో
ఈ కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానించేలా ఫ్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేయనున్న జియో.
ప్రభుత్వం, పథకం లబ్ధిదారులైన మహిళల మధ్య నేరుగా అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు. తద్వారా, సాఫీగా కార్యకలాపాలు.
 
అల్లానా
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అల్లానాకు విశేష అనుభవం.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో విశేష అనుభవం, భారీగా కంపెనీ నుంచి ఎగుమతులు.
1865 నుంచి కంపెనీ కార్యకలాపాలు.
పాడి పశువుల పెంపకంలో సాంకేతిక సహకారాన్ని అందించనున్న అల్లానా.
గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో సహకారం. వాటిని తిరిగి కొనుగోలు చేయనున్న అల్లానా.