పిఠాపురంలో రూ.17 కోట్ల విలువ చేసే బంగారు స్వాధీనం!!
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన బిల్లు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్‌టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.
వివరాల్లోకి వెళితే... శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖపట్టణం నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన వాహనం వారికి కనిపించింది. వెంటనే తనిఖీలు చేపట్టగా అందులో బంగారు, వెండి వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. వాటికి సరైన ధృవపత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం తాహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పంచానామా అనంతరం సీజ్ చేసిన ఖజానా కార్యాలయానికి తరలించారు.