సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (20:02 IST)

ఏపీ ప్రజలకు సేవ చేస్తా : అయోధ్య రామిరెడ్డి

తనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచినందుకు ఆనందంగా ఉందన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర వాణి వినిపిస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి సీఎం వైఎస్‌ జగన్‌ అవకాశం కల్పించారని అన్నారు.

తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రజలకు మేలు చేస్తానని తెలిపారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలోనే వైఎస్‌ జగన్‌ కూడా నడుస్తున్నారని చెప్పారు. కాగా, రాజ్యసభ ఎన్నికలకు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ పరిమల్‌ నత్వాని పేర్లను ప్రకటించింది.
 
సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్‌ నత్వాని
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ పరిమల్‌ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పెద్దల సభకు నామినేట్‌ చేసిందుకు సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పరిమల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేస్తాను’ అని పోస్ట్‌ చేశారు.  ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు.

అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో పార్టీ ముఖ్యనేతలో చర్చించిన అనంతరం పరిమల్‌ను పెద్దల సభకు నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.