సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (18:55 IST)

కరోనా ఎఫెక్టు.. షార్ సెంటర్ మూసివేత... దేశంలో పెరిగిన మృతులు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక వ్యవస్థలు, రంగాలు మూతపడుతున్నాయి. ఇప్పటికే దేశంలో ప్రయాణికుల రైళ్ళ రాకపోకలను పూర్తిగా నిలిపివేయగా, 19 రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. మరోవైపు, కరోనా భయం కారణంగా దేశీయ అంతర్జాతీయ మార్కెట్లు సైతం కుప్పకూలిపోతున్నాయి. 
 
తాజాగా, శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రంపైనా కరోనా ప్రభావం పడింది. ఈ నెల 31 వరకు శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కార్యక్రమాలు నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షార్‌ కేంద్రాన్ని కూడా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. 
 
అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. సిబ్బంది కోసం నిర్దేశించిన జనరల్ షిఫ్ట్ బస్సులను రద్దు చేశారు. షార్ కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను సైతం నిలిపివేశారని తెలుస్తోంది. 
 
మరోవైపు, భారత్‌లో కరోనా భూతం వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా, కోల్‌కతాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మరణించినట్టు సమాచారం. ఈ 55 ఏళ్ల వ్యక్తి ఇటీవలే కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య 9కి చేరింది. 
 
అటు యూరప్ దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువే అయినా, వైరస్ వ్యాపిస్తున్న తీరు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్ మరో వారం రోజుల తర్వాత ఫలితాన్నివ్వడం ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఎవరికీ కరోనా వైరస్ సోకకపోతే ప్రభుత్వ చర్యలు ఫలించినట్టే భావించాలి.