గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (15:59 IST)

మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా : శివాజీ రాజా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయిన నటుడు శివాజీ.. తన ఓటమికి కారణమైన మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా అంటూ ధ్వజమెత్తారు. 
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికిరాత్రే మద్దతు ఇచ్చారన్నారు. ఎన్నికల్లో గెలిచిన సదరు వ్యక్తులు రెండు రోజుల తర్వాత మెగా ఫ్యామిలీని మళ్లీ తిట్టారన్నారు. నాగబాబు వల్ల 'మా' ప్రతిష్ట దిగజారిపోయిందనీ, అభివృద్ధిలో రెండేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. 
 
600 మంది సభ్యులు మాత్రమే ఉన్న 'మా'కు న్యాయం చేయలేని నాగబాబు నరసాపురం ప్రజలకు ఏమి చేస్తాడని ప్రశ్నించారు. జనసేన తరఫున లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న నాగబాబుకు ఓటేయవద్దని నరసాపురం ప్రజలకు శివాజీ రాజా విజ్ఞప్తి చేశారు.
 
నరసాపురంలో లోక్‌సభ బరిలో ఉన్న వారిలో ఒక్క నాగబాబుకు మినహా మిగిలిన అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఓటర్లకు నచ్చిన వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 'నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్‌ కల్యాణ్‌ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది.. నరసాపురం నాది అంటున్నాడు.. ఎలా అవుతుంది' అని శివాజీ రాజా ప్రశ్నించారు. 
 
'భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా? నరసాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్‌లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నరసాపురం వెళ్లి సేవ చేస్తావా?'  అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.