శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (10:49 IST)

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 17 నుంచి పదో తరగతి పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు పరిమితం చేయనున్నారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ ఐదు నెలలుగా ఆలస్యంగా ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
పబ్లిక్‌ పరీక్షలను జూన్‌ 17 నుంచి నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అనేక అంశాలపై చర్చించారు.
 
కోవిడ్‌ కారణంగా గత ఏడాదిలో విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించినా కరోనా తీవ్రత ఉన్నందున రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఈ విద్యా సంవత్సరంలో కూడా తరగతులు ఆలస్యం కావడంతో సిలబస్‌ కుదించి బోధన చేస్తున్నారు. దీంతో పాటు బోధనాభ్యస కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరగనందున గత ఏడాది మాదిరిగానే ఈ సారి పేపర్ల సంఖ్య 7కు కుదించారు. 
 
గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 6కు కుదించారు. ఈ సారి భాషా పేపర్లు, సైన్స్‌ మినహా ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున ఐదు ఉంటాయి. సైన్స్‌లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రాలకు సంబంధించి వేర్వేరు పేపర్లు ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థుల పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
 
ఇకపోతే.. విద్యాసంవత్సరం, తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో టెన్త్‌ విద్యార్థులకు సిలబస్‌ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులు కొనసాగించాలని భావిస్తోంది.