1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (14:20 IST)

పోలవరం టెండర్లకు కేంద్రం బ్రేక్... దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచనిస్థితిలోపడింది. తాజాగా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను తక్షణం నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచనిస్థితిలోపడింది. తాజాగా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను తక్షణం నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. జాతీయ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) అధ్యయనం చేసేంతవరకు పనులను నిలిపివేయాలని సూచించింది. కొన్నిరోజుల్లో ఎన్‌హెచ్‌పీసీ బృందం పోలవరానికి వస్తుందని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 
 
స్పిల్ వే, స్పిల్‌ ఛానల్‌లోని పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లు... నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం. ముఖ్యంగా టెండర్లు స్వీకరించేందుకు మూడు వారాల కంటే తక్కువగా వ్యవధిని ఇచ్చారని.. కనీసం 45 రోజులైన సమయం ఇవ్వాలని పేర్కొనట్టు తెలుస్తోంది. నవంబర్ 22వ తేదీకి కూడా ఈ-టెండర్ నోటీస్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించకపోవడాన్ని కేంద్రం ప్రధానంగా ప్రస్తావించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని టెండర్ ప్రక్రియపై పున:పరిశీలన చేయాలని, సమస్యలు పరిష్కారమయ్యే వరకూ టెండర్‌ను వెంటనే నిలిపివేయాలని 27న పంపిన లేఖలో స్పష్టంచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనుల విషయంలో సందిగ్ధంలో పడింది. 
 
మరోవైపు, పోలవరం పనులు నిలిపివేయాలని కోరుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ కూడా పోలవరం పనులపై ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాలు, నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా టెండర్లను నిలిపివేయమనడంతో.. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. దీంతో 2018-2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.