నెంబర్ వన్ ఆస్పత్రిగా స్విమ్స్.. వైవీ సుబ్బారెడ్డి సూచన
శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)ను నెంబర్ వన్ స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
సోమవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వైవీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆస్పత్రిలో పరిస్థితులను అధ్యయనం చేసి చేయాల్సిన పనులు, కావాల్సిన ఎక్విప్‌మెంట్సు గురించి ఓ నివేదిక రూపొందించాలని కోరారు.
ఆస్పత్రిని అత్యున్నత స్థాయి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందని సుబ్బారెడ్డి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యుత్తమ చికిత్స అందించేందుకు చేపట్టాల్సిన అంశాలను కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు.
రోగులకు చికిత్స అందించడంలో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా ఆస్పత్రిని తీర్చిదిద్దాలని కోరారు.