దాచేపల్లి అత్యాచార ఘటనను నీరుగార్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర..తెదేపా
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల ముస్లీం మైనారిటీ బాలికను ప్రభుత్వం హుటాహుటినా స్వగ్రామానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ప్రశ్నించారు.
ఈ విషయమై మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారనే సమాచారంతో.. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసింది.
హుటాహుటిన పోలీసు రక్షణతో స్వగ్రామానికి బలవంతంగా తరలించింది. నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం.. వైద్యం కోసం జీజీహెచ్‌కు వచ్చిన బాలికను హుటాహుటిన పోలీసు రక్షణతో స్వగ్రామానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఈ ఘటన నిదర్శనంలా నిలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి.
అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. నిందితులకు వత్తాసు పలికేలా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం. 19.10.19న ఆరేళ్ల ముస్లీం మైనారిటీ బాలికపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి అనుచరుడు నరేందర్‌రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత 10 రోజుల నుంచి బాలిక నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటివరకు ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోలేదు. నిందితుడు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అనుచరుడు కాబట్టి ప్రభుత్వం అతడికి కొమ్ముకాస్తోంది.
కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ముస్లీం మైనారిటీ పెద్దలు 25.10.19న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారిని కలిసి వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని, తగిన న్యాయం చేయాలని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన చంద్రబాబునాయుడు మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించడం జరిగింది.
ఈ బృందం 26.09.10 తేదీన బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. దీంతో ప్రభుత్వం బాలికను గుంటూరు జీజీహెచ్‌కు హుటాహుటిన తరలించింది. అదే రోజు రాత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సదరు బాలికను పరామర్శించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారు.
ఇప్పుడు హోంమంత్రి సుచరిత ప్రకటించిన పరిహారం కూడా మాటలకే పరిమితం అయింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలి.