శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (17:54 IST)

గ‌డువుకు ముందే దించేస్తారా? కోర్టుకు వెళ‌తాం, టీడీపీ ఎమ్మెల్సీలు

ఏపీలో శాస‌న మండ‌లి ర‌ద్దు దుమారం ఇంకా చెల‌రేగుతూనే ఉంది. తమ పదవి కాలం ముగియక ముందే ప‌ద‌వీ విర‌మ‌ణ ఎలా ప్రకటిస్తార‌ని తెలుగుదేశం ఎమ్మెల్సీలు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. దీనిని వ్య‌తిరేకిస్తూ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. 
 
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలని డిమాండు చేశారు. త‌మ‌ను ఆగష్టు 11 వరకు పదవిలో కొనసాగించాలని, అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ నేత‌లు ద్వారంపూడి జగదీష్, రెడ్డి సుబ్రమణ్యం, రాజేంద్రప్రసాద్ లేఖ రాశారు. తమను ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయమని, సీఈసీ ఉత్త‌ర్వుల‌కు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని ఆరోపించారు. దీనిపై తాము ఉన్న‌త న్యాయ‌స్థానానికి వెళుతున్న‌ట్లు టీడీపీ ఎమ్మెల్సీలు తెలిపారు.

జూన్ 18న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు, ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైరైనట్లు అసెంబ్లీ వ‌ర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇది కేవ‌లం వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేసిన పన్నాగ‌మ‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఏపీలో శాస‌న మండలి ర‌ద్దుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా?  లేదా అనేది ఇంతవ‌ర‌కు తేల‌లేద‌ని, అది చ‌ట్ట‌బ‌ద్ధమా కాదా అనేది కూడా తేలాల‌ని పేర్కొంటున్నారు. దీనికోసం తాము హైకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం చెపుతున్నారు.