యూనిఫామ్ తీసేసి, తాడేపల్లిలో బులుగు కండువాలు కప్పుకుని మాట్లాడండి...
ముగ్గురు ఐపీఎస్ అధికారులు, వైసీపీ అధికారుల్లా దిగజారి మాట్లాడడం ఇండియన్ పోలీస్ సర్వీస్ హిస్టరీలో బ్లాక్ డే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఇంత చదువు చదివి, ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పొంది, ప్రజా ధనం జీతంగా తీసుకుంటూ, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించడానికి సిగ్గు లేదా? అని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
వైసీపీకి వత్తాసు పలికే మీరు పవిత్రమైన యూనిఫామ్ తీసేసి.. తాడేపల్లిలో బులుగు కండువాలు కప్పుకుని మాట్లాడండి. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్తున్నానని జోగి రమేష్ ప్రకటించి మరీ గూండాలతో దాడిచేస్తే, మీకు సమాచారం లేదా? మాపై దాడి జరిగిందని చెప్పుకోవడానికి వచ్చిన టీడీపీ నేతలు మీపై దాడి చేశారా? పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చ మీ వ్యవహార శైలి అని లోకేష్ మండిపడ్డారు.
మాజీ సీఎం ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కు కొమ్ముకాసి పోలీసు వ్యవస్థ గౌరవాన్నే మంటగలిపారని, ఈ పద్ధతిని పోలీసులు విడనాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.