శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (18:38 IST)

పదో తరగతి పరీక్షలు రద్దు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: పవన్ కళ్యాణ్

పదో తరగతి పరీక్షలు రద్దు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన ఇలా పేర్కొన్నారు. ''కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పక్షాన జనసేన చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలను రద్దు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సరైన సమయంలో సముచిత నిర్ణయం ఇది.
 
వీటితో పాటు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయం. కరోనా విస్తృతి ఏవిధంగా వున్నదో మనందరికీ తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజూ వందలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి.
 
ఈ తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకోవడం ఘోర తప్పిదంగా ప్రజలు భావించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రయాసతో కూడిన పని. పరీక్షా కేంద్రాలలోకి వెళ్లే సమయంలోను, తిరిగి బయటకు వచ్చేటపుడు భౌతిక దూరం పాటించడం అసాధ్యం. పిల్లలంతా గుంపులుగుంపులుగా లోనికి వెళతారు, వస్తారు. ఇది ప్రమాదకరం.
 
 నిపుణులు, విద్యావేత్తలతో విస్తృతంగా మాట్లాడటంతో పాటు పొరుగు రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలను అధ్యయనం చేసిన తరువాతే పదో తరగతి పరీక్షలను రద్దు చేయవలసిందిగా జనసేన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లక్షలాది మంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టవద్దని కోరింది. ఈ విషయంలో సహేతుంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, రద్దు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ తరపున అభినందనలు తెలుపుతున్నాను.''