ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 7 ఆగస్టు 2020 (23:02 IST)

ఆవేశంగా అక్కడికి వెళ్ళిన తిరుమల అర్చకులు, ఎందుకు వెనక్కి తగ్గారంటే.?

కరోనాతో నిన్న తిరుమలలో విధులు నిర్వర్తించే అర్చకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. కరోనా సోకిన ఇంకా కొంతమంది అర్చకులు, టిటిడి ఉద్యోగులు ప్రస్తుతం ట్రీట్మెంట్‌లో ఉన్నారు. అయితే అర్చకుడి మృతి తరువాత ఆలయ దర్సనాన్ని నిలిపివేస్తారని అందరూ భావించారు.
 
ఇదే విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని అర్చకులు భావించారు. నిన్న హడావిడిగా కొండపై ఆలయ ఓఎస్డీ ఇంట్లో 14 మంది అర్చకులు సమావేశమయ్యారు. దర్సనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని.. అలాగే ఉదయం సుప్రభాతంను ఐదుగంటలకు ప్రారంభించేలా.. ఏకాంత సేవను రాత్రి 7 గంటలకే పూర్తి చేసేలా చూడాలని రెండు విషయాలను టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నారు.
 
రాత్రి పొద్దుపోయేంత వరకు వీరి హడావిడి ఆవేశ సమావేశం జరిగింది. ఇక ఉదయం టిటిడి ఈఓ, తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారిని కలవాలనుకున్నారు. కానీ ఉన్నట్లుండి అర్చకులు వెనక్కి తగ్గారు. కొంతమంది ఉన్నతాధికారులను కలవడానికి తిరుపతికి బయలుదేరితే మరికొంతమంది సైలెంట్‌గా ఉండిపోయారు.
 
ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. మనకు మనం నిర్ణయం తీసుకుని ఉన్నతాధికారులను కలిస్తే మనపైనే చర్యలు తీసుకుంటారేమోనని భయపడిపోయారట అర్చకులు. అందుకే తాము సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని ఏమాత్రం అనుకోలేదు. అయితే మరోవైపు అర్చకుడు కరోనాతో చనిపోవడం మాత్రం టిటిడిలో పెద్ద చర్చే జరుగుతోంది. కానీ టిటిడి ఉన్నతాధికారులు మాత్రం ఆలయంలో దర్సనాన్ని మాత్రం ఆపడం లేదు.