1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (10:35 IST)

వేకన్సీ రిజర్వ్‌ మూడు నెలలే .. డీజీపీ

పోలీసు శాఖకు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ శాఖలో ఆనందం నింపింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీసులను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపించడం సాధారణ అంశం.

అయితే, ఇలా పంపిన ఉద్యోగిని ఎప్పుడు పునర్నియమిస్తారనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టతలేదు. వారాల నుంచి కొన్ని నెలల వరకు కూడా వీఆర్‌లో కొనసాగుతున్న వారున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వీరికి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది.

ఏ స్థాయి అధికారికైనా వీఆర్‌ 3మాసాలకు మించరాదని ఆదేశించింది. ఈమేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ జిల్లాల ఎస్పీలకు వెంటనే ఆదేశాలు పంపారు.
 
వీఆర్‌ విధం ఇదీ..!
కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ వరకు ఎవరైనా విధి నిర్వహణలో పొరపాటు చేస్తే జిల్లా ఎస్పీ వీఆర్‌కు పంపుతారు. అదే సీఐ స్థాయి అధికారిని డీఐజీ, డీఎస్పీని డీజీపీ వీఆర్‌కు పంపుతారు.

ఎస్పీ నుంచి ఐపీఎస్‌ అధికారుల వరకు వీఆర్‌కు ఆదేశించినవారిని ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయం లేదా జీఏడీకి రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశిస్తుంది. వీఆర్‌లో వెయిటింగ్‌లో ఉన్నవారికి జీతం రాదు, అయినా ఎస్పీ, డీఐజీ, డీజీపీ కార్యాలయానికి రోజూ వచ్చి వెళ్లాల్సిందే. దీంతో వీఆర్‌ అంటే భారీ శిక్షగా భవిస్తారు.

ఇటీవల ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులను వీఆర్‌కు పంపారు. అంతకుముందు ప్రభుత్వంలో పలువురిని ఏడాది, ఏడాదిన్నర పాటు వీఆర్‌లో ఉంచారు.
 
ఇప్పుడు వాళ్లందరూ తమ పాతజీతాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన ఆర్థికశాఖ ఏడాది పైగా జీతాలు ఇవ్వకుండా ఇంతమందిని ఎందుకు ఖాళీగా ఉంచారని అడిగింది. దీంతో ఇకపై ఎవరినైౖనా మూడు నెలలకు మించి వీఆర్‌లో పెట్టొద్దని ప్రభుత్వం సూచించింది.

రాష్ట్రంలో 5నెలల క్రితం ప్రభుత్వం మారడంతో వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపారు. క్షేత్రస్థాయి పోలీసుల నుంచి, సబ్‌ డివిజనల్‌ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారి కోయ ప్రవీణ్‌, డీఐజీ ర్యాంకులో ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌, డీజీపీ ర్యాంకు అధికారి ఏబీ వేంకటేశ్వరరావు వరకూ పలువురు పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.