శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (10:20 IST)

తిరుపతిలో ఆ పేరు మార్చేశారు : తెరపైకి మరో వివాదం

వైకాపా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో రూ.684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధి పేరు శ్రీనివాస సేతుగా మారుస్తున్నట్లుగా నగర పాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే, గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన ఈ వారధి పేరును ఇప్పుడు మార్చడం వివాదాస్పదమైంది. 
 
కానీ, అధికారికంగా ఎలాంటి పేరు లేదని స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. స్వామి వారికి గరుడు అత్యంత ప్రీతిపాత్రుడని, కాబట్టి ఆ పేరుతో ఉన్న సేతుపై నుంచి రాకపోకలు సాగించడం భావ్యం కాదనే వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చుతున్నట్టు వివరించారు. 
 
అయితే, ఆయన వ్యాఖ్యలను మరికొందరు తప్పుబడుతున్నారు. గరుడి పేరుతో ఉన్న వారధిపై నడవడం తప్పు అయినప్పుడు స్వామి పేరుతో ఉన్న వంతెనపై నుంచి నడవడం ఒప్పెలా అవుతుందో కరుణాకర్ రెడ్డి వివరించాలని కోరారు. మరోవైపు ఈ వారధి పేరు మార్పును వ్యతిరేకిస్తూ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ సమావేశాన్ని బహిష్కరించారు.