మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 27 మే 2019 (18:25 IST)

అసెంబ్లీ నుంచి గెంటేశారు.. జగన్ రోడ్లపై పడ్డారు.. ప్రజలు పట్టంకట్టారు....

వైకాపా అఖండ విజయం సాధించడానికి గల కారణాలను మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. వైకాపా తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలను ఒక యేడాది పాటు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేశారనీ, అందుకే జగన్ రోడ్లపై పడి ప్రజలతో కలిసిపోయారని, ఈ ఒక్క కారణంగానే వైకాపాకు ప్రజలు పట్టంకట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన ఏకైక పార్టీ ఒక్క వైకాపానే అని చెప్పారు. వైకాపా ఎల్పీ సమావేశంలోనూ, ఢిల్లీలోనూ జగన్ మాట్లాడిన తీరు చూస్తే తనకు వైఎస్ఆర్ గుర్తుకు వచ్చారన్నారు. తమ పాలనలో అవినీతికి తావులేకుండా పారదర్శకతతో కూడిన పాలన అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. 
 
అలాగే, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జ్యూడిషీయల్ బాడీని ఏర్పాటు చేస్తామని చెప్పడం స్వాగతించదగ్గ విషయమన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వైఎస్సార్‌ గతంలో ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహాలను స్వీకరించండని వైఎస్‌ జగన్‌కు సూచించారు.
 
జగన్ మరో 30 యేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలని భావిస్తున్నారని, అలా జరగాలంటే కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలు, విధి విధానాలను కూడా నవ్యాంధ్రలో అమలు చేయాలని కోరారు. అపుడే జగన్ కల నెరవేరుతుందన్నారు. కేరళలో ప్రజలు కూడా ఒక్క పైసా లంచం ఇచ్చేందుకు ససేమిరా అంటారన్నారు. పైగా, లంచాలు తీసుకునే రాజకీయ నేతలు ఎన్నికల్లో ఓడిస్తారని, అందువల్లే కేరళలో ముడుపులు తీసుకునేందుకు రాజకీయ నేతలు అంగీకరించరన్నారు. కేవలం రూ.87 లక్షల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉమెన్ చాంది తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారని ఉండవల్ల గుర్తుచేశారు. అందువల్ల పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందించేందుకు కేరళ పాలసీని నవ్యాంధ్రలో అమలు చేయాలని ఆయన కోరారు.