బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 31 అక్టోబరు 2020 (21:01 IST)

పోలీసు స్టేషన్‌కు వెళ్ళి పోలీసులను చితకబాదిన గ్రామస్తులు, ఎందుకు?

మరికాపేపట్లో పెళ్ళి జరుగబోతోంది. ఉన్నట్లుండి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అబ్బాయికి 34 యేళ్ళు... అమ్మాయి మైనర్. వివాహం చేయకూడదన్నారు. దీంతో  పోలీసులను ప్రాధేయపడ్డారు బంధువులు. వినిపించుకోలేదు పోలీసులు. ఒక ఎస్ఐ ఏకంగా పెళ్ళిలో కుటుంబ పెద్దపై చేయి చేసుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయారు గ్రామస్తులు. పోలీసులు వెళ్ళేంత వరకు సైలెంట్‌గా ఉన్నారు. ఆ తరువాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి స్టేషన్ పైన దాడి చేసి పోలీసులను చితకబాదారు.
 
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం యనమల గ్రామంలో ఈ రోజు ఉదయం వివాహాన్ని ఆపారు పోలీసులు. కరోనా నిబంధనలతో పెళ్ళి జరుగుతోంది. కానీ వివాహం మాత్రం మైనర్, మేజర్‌కు జరుగుతోంది. అమ్మాయికి చాలా చిన్న వయస్సు.. అబ్బాయికి 34 యేళ్ళు. దీంతో పోలీసులకు సమాచారం అందింది.
 
వెంటనే పోలీసులు పెళ్ళిని ఆపేశారు. అక్కడకు వెళ్ళి కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్‌కు పిలిచారు. అయితే వారు వెళ్ళలేదు. పెళ్ళి సమయం అయిపోతోంది వెళ్ళిపోండి అంటూ ప్రాధేయపడ్డారు. అయితే వినిపించుకోలేదు పోలీసులు. 
 
వెదురుకుప్పం ఎస్ఐ పెళ్ళి పెద్దపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడాడు. దీంతో గ్రామస్తులు ఆ ప్రాంతంలో సైలెంట్‌గా ఉన్నారు. కానీ గంట తరువాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి దాడి చేశారు. దొరికిన పోలీసులను చితక్కొట్టారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఎఫ్.ఐ.ఆర్ కాపీలను చిందరవందరగా పడేశారు.  ఒక్కసారిగా పోలీస్టేషన్ లోకి గ్రామస్తులు వెళ్ళడంతో ఆ గుంపులో ఒక మహిళ కాలికి గాయమైంది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
 
ప్రస్తుతానికి గ్రామస్తులను బుజ్జగించి పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. కానీ ఘటనపై మాత్రం కొంతమందిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.