ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

దృష్టి లోపాల నివారణే వైయస్సార్ కంటి వెలుగు లక్ష్యం.. తమ్మినేని

దృష్టి లేకపోతే సృష్టిని కనిపించదని, అటువంటి దృష్టి లోపాలను నివారించేందుకు డాక్ట‌ర్ వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగిందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు.

ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

చిన్నారులు, పెద్దలలో దృష్టి లోపాలను నివారించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం మంచి కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. దృష్టి లేకపోతే సృష్టి కనిపించదని, అటువంటి దృష్టిలోపాలను గుర్తించి వారికి అవసరమైన చికిత్సను అందించడమే డా.వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.

”సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అనే నానుడి ఉందని, అందులో భాగంగా  ఈ పథకం క్రింద ఆరు రకాల నేత్ర పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.560 కోట్లను ఖర్చు చేస్తోందని వివరించారు.

చాలా మందికి కంటి చూపు లేకపోవడంతో తమ జీవితాలు నాశనం అవుతున్నాయని, ఈ పథకం ద్వారా జిల్లాలోని ప్రతీ ఒక్కరూ తమ దృష్టి లోపాలను సరిచేసుకోవచ్చని, అవసరమైతే శస్త్రచికిత్సలను ఉచితంగా పొంది, అవసరమైన కంటి అద్దాలు, మందులను కూడా ఉచితంగా పొందవచ్చని అన్నారు.

డా. వై.యస్.ఆర్.ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యి రూపాయలు పైబడిన వాటికి  కార్పొరేట్ వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యకర సమాజంతో దేశంలో సంపద సృష్టి పెరుగుతుందని పేర్కొన్నారు. 2020 జనవరి 26 నుండి అమ్మఒడి పథకం అమలుకానుందని శాసనసభాపతి వివరించారు.

కంటి వెలుగు ద్వారా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని, కంటి వెలుగు అమలులో రాష్ట్రంలో అగ్ర స్థానంలో ఉండాలని శాసనసభాపతి ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలుచేస్తొన్న నవరత్నాలలో సైతం జిల్లా అగ్ర స్థానంలో ఉండాలని, ఇందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

అనంతరం సి.ఎం.రిలీఫ్ ఫండ్ క్రింద ఎస్.సరస్వతికి చెక్ ను, వైద్య సిబ్బందికి కంటి వెలుగు కిట్లను మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పంపిణీ చేశారు. 

 
రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ దృష్టి లోపాలను నివారించేందుకు డా.వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఇది చక్కని కార్యక్రమమని, దీనిద్వారా చిన్నారులు, పెద్దలు నేత్ర పరీక్షలు చేసుకుని వారి దృష్టి లోపాలను తొలగించుకోవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇదేకాకుండా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, మరిన్ని కార్యక్రమాలను అమలుచేయబోతుందని మంత్రి స్పష్టం చేసారు. 

 
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. నేత్ర సమస్యలతో చిన్నారులు విద్యకు దూరం కాకూడదని, వివిధ రకాల నేత్ర సమస్యలతో బాధపడేవారు వాటిని తొలగించుకొని వెలుగు ప్రసాదించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ముఖ్యంగా పెద్ద వయస్సులో కాటరాక్టు అవసరమని, అటువంటివారు తప్పకుండా తమ దృష్టిలోపాలను సరిచేసుకోవాలని పిలుపునిచ్చారు. నేత్ర సమస్యలతో బాధపడేవారిని పరీక్షించి అవసరమైన వారికి నవంబర్ 1నుండి డిసెంబరు 31లోగా కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.

అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలోని విద్యార్ధులకు నేత్ర పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 3 దశలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేసారు.

అక్టోబర్ 10 నుండి 16 వరకు నిర్వహించే మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించి, వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు నిర్వహించే రెండవ దశలో దృష్టిలోపాలు కలిగిన విద్యార్ధులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత శస్త్ర చికిత్సలతో పాటు ఉచిత కంటి అద్దాలను  పంపిణీచేయడం జరుగుతుందని,  మూడవ దశ క్రింద 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2022 జనవరి 31 వరకు జిల్లాలోని ప్రజలందరికీ ఉచిత సమగ్ర కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

ఈ పథకం క్రింద జిల్లాలోని 3,894 ప్రభుత్వ, ప్రైవేట్  పాఠశాలల్లో చదువుతున్న 3,69,366 మంది విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించనున్నట్లు  చెప్పారు. ప్రాథమిక దశలో కంటి సమస్యలతో బాధపడు విద్యార్ధులను గుర్తించి నిపుణులైన కంటి వైద్య సిబ్బందితో శస్త్ర చికిత్సలను నిర్వహించి వారికి అవసరమైన మందులు,కంటి అద్దాలను పంపిణీచేస్తారు.రక్త దానం, అవయవ దానం చేయుటకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎం.చెంచయ్య మాట్లాడుతూ ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా  వై.యస్.ఆర్. కంటి వెలుగు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిదని, దీన్ని జిల్లాలోని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా డా.వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అమలవుతుందని,  ఉచిత శుక్లాల శస్త్రచికిత్సలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మొదలగు కంటి సమస్యలకు ఉచిత చికిత్సలను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

84 పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3,051 బృందాలు కంటి పరీక్షలు నిర్వహించనున్నాయని ఆయన  పేర్కొన్నారు. ఇందుకోసం 3,091 మంది ఆశా కార్యకర్తలు, 700 మంది మహిళా కార్యకర్తలు, 3,894 మంది ఉపాధ్యాయుల పనిచేయనున్నట్లు ఆయన వివరించారు.

కంటి పరీక్షలు నిర్వహించే బృందాలకు విజన్ కిట్లను పంపిణీచేసామని, ఇందులో ఇ – చార్టు,  టేపు మరియు టార్చిలైటుతో పాటు సూచనలు ఉంటాయని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ నేత్ర పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.

సమావేశంలో సహాయ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, ఆర్డీఓ ఎం.వి.రమణ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, డిబిసిఎస్ పి.ఓ డా.రమణ కుమార్, డిటిటి పి.ఓ డా.యల్.మోహనరావు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, తహశీల్దార్ ప్రవల్లిక, ఉపాధి హామీ ఏ.పి.డి ఆర్.వి.రామన్, విశ్రాంత ప్రిన్సిపాల్ సురంగి మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.