శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (09:59 IST)

ఏపీలో జాతీయ విపత్తుల చట్టం ... ప్రయోగిస్తే ఉపయోగమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 సెక్షన్ 10(2)1ని ప్రయోగించింది. 
 
అలాగే, అంటు వ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇక సర్కారు పరిధిలో పని చేయాలని ఆదేశించింది. ఈ రెండు చట్టాలను అమల్లోకి తెచ్చిన తర్వాత తొలి దశలో 450 ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది. కరోనా వ్యాప్తి పరిస్థితిని బట్టి ఈ సంఖ్య పెంచుతామని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైగా, వైద్య సేవల వినియోగంపై పూర్తిగా విశేషాధికారాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 
 
అసలు ఈ చట్టాన్ని ప్రయోగించడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ లేదా ప్రభుత్వేతర వైద్య, ఆరోగ్య సంస్థలు, అందులోని సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ఐసోలేషన్‌ పడకలు, గదులు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, ప్రయోగశాలలు, మందులషాపులు, మార్చురీలు, వైద్య పరికరాలు, అత్యవసర రెస్పాన్స్‌ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాల్సి వుంటుంది.
 
అంతేకాకుండా, ఏ వసతుల వినియోగానికైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంటుంది. ఈ ఆసుపత్రులన్నీ జిల్లా స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు సహా అక్కడ పని చేస్తున్న ఎవరినైనా ప్రభుత్వం ఎక్కడైనా నియమించుకునే వెసులుబాటు వుంది. అందుకే ముందు జాగ్రత్తగా, దూరదృష్టితో ఆలోచన చేసి ఏపీ సర్కారు జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 సెక్షన్ 10(2)1ని ప్రయోగించిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.