గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (13:53 IST)

చంద్రబాబు నాయుడు తెదేపా ఓటమికి ఇవే కారణాలు...

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోనున్నారు. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఏపీని అభివృద్ధి చేస్తానని ఏపీకి రాజధానిని నిర్మిస్తానని కంకణం కట్టుకుని అధికారంలోకి వచ్చిన నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూడటానికి కారణాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో పరాజయం పాలవడానికి ముఖ్య కారణం జనసేనాని పవన్ కల్యాణ్ అని జనం అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ టీడీపీకి దూరం కావడం ఆ పార్టీకి గట్టిదెబ్బ కొట్టినట్లైంది. ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా పోరాడకపోవడం.. ప్రత్యేక ప్యాకేజీకి తలొగ్గడంతో బాబు తప్పటడుగు వేశారు. దీన్ని క్యాష్ చేసుకున్న బీజేపీ.. ప్రత్యేక హోదాను వెనక్కి నెట్టేసింది. 
 
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఎన్డీయే తేల్చి చెప్పేయడంతో.. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు.. ప్యాకేజీని కూడా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వట్లేదని.. హోదా విషయంలో ఎన్డీయే వెనక్కి తగ్గడంతో.. మిత్రపక్షంతో తెగతెంపులు చేసుకున్నారు. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకోవడం టీడీపీకి మరో మైనస్ పాయింట్‌గా మిగిలిపోయింది.

ఆపై చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు ప్రకటించిన పథకాలను అమలు చేయడంలో లొసుగులు, ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టడం వంటివి చంద్రబాబు ఓటమికి కారణమయ్యాయి. 
 
అంతేగాకుండా అభివృద్ధి పేరిట అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టారు. కానీ అమరావతి నిర్మాణంలో జాప్యం, అమరావతిని సింగపూర్‌లా మార్చుతానని శపథం చేసినా అందుకు తగిన చర్యలు అమల్లోకి రాకపోవడం.. ఇందుకు కేంద్రం నిధులను అందించకపోవడం వంటివి చంద్రబాబుపై ప్రజల్లో ఆదరణను సన్నగిల్లేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది చాలదన్నట్లు బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి తెరతీయడంతో ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నది మరో వాదన.
 
అలాగే చంద్రబాబు నాయుడు పతనానికి రామ్ గోపాల్ వర్మ కూడా చెక్ పెట్టాడని కూడా వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సీన్లు కొన్ని ఓటర్లపై ప్రభావం చూపాయని నెట్టింట చర్చ సాగుతోంది. వర్మ సినిమాకు బ్రేకులు వేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని.. జనం మాట్లాడుకుంటున్నారు. 
 
అంతేగాకుండా తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలపై జనం మరోలా కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రధాన మంత్రి మోదీ వల్లే వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారని.. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని.. ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్‌పై చంద్రబాబు పోరాడరని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించిన తీరుపై ఆయన మండిపడ్డారు. 
 
ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఓటమిని చవిచూశారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.