గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:38 IST)

రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షానికి ఆనందమెందుకు?: మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో రైతులను ఆదుకొని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడమే ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఇటీవల ఎన్స్ సి ఆర్ బి( నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2019లో 1029 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గణాంకాలను చూపిన విషయంలో వస్తున్న అవాస్తవ వార్తలను మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు.ఇందులో 628 మంది రైతులు ఉండగా,మిగతా  401మంది కౌలు రైతులుగా ఆ రికార్డులను బట్టి తెలిసిందన్నారు.

తమ ప్రభుత్వ హాయాంలో ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు జరిగాయని ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తోందని తప్పుపట్టారు.ఈ పాపం గతంలో పనిచేసిన ప్రభుత్వానిదేని స్పష్టం చేశారు. 2019లో జూన్ నెలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందని అంకముందు ఆరునెలలు పాలన చేసిన గత ప్రభుత్వ తప్పిదాలను తాము కడిగే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యల కారణంగా 2020లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి వివరించారు. ఏదైనా రైతు ఆత్మహత్య చేసుకొని విషాదం జరిగితే ,అయ్యో పాపం అనాల్సిన ప్రతిపక్షం.. చంకలు గుద్దుకుంటోందని మంత్రి చురకలు అంటించారు.

2020 సంవత్సరంలో 157మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే త్రిసభ్య కమిటి నివేదిక అనంతరం  33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా నిర్దారించారని తెలిపారు. రైతు ఆత్మహత్య జరిగితే ఆ రైతు కుటుంబాన్ని ఆర్థిక సాయం అందించి వెంటనే ఆదుకుంటున్నామని మంత్రి  కన్నబాబు స్పష్టం చేశారు.
 
వైఎస్సార్ రైతు భరోసా అమలుతో రైతులను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం..
వైఎస్సార్ రైతు భరోసా అమలుతో రైతులను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.ఇప్పటి వరకు రైతు భరోసా పధకం ద్వారా రూ. 10,200 కోట్లు రైతు ఖాతాల్లో ఇప్పటి వరకు నేరుగా జమ చేశామన్నారు.

రైతులకు వడ్డీ లేని రుణాలే కాకుండా, అనేక రకాలుగా రైతుల వ్యవసాయానికి లబ్ది చేకూరుస్తున్నామన్నారు.లాక్ డౌన్ సమయంలో అరటి మొదలుకుని జామ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.రైతులు అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఆ కారణాలను విచారించిన తరువాత త్రిసభ్య కమిటి సూచనల మేరకు,ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వెంటనే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల అందరికీ పరిహారం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేస్తున్న తీరు అందరూ చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.2020-21 లో 49.45 లక్షల కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించామన్నారు.

ఇప్పటి వరకు 10,200 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. రైతుల మేలుకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి అందిస్తున్నామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. 
 
రాష్ట్రంలో తొలిసారిగా పొగాకు కొనుగోళ్లు ... 
రాష్ట్రంలో తొలిసారిగా పొగాకు కొనుగోళ్లు ను సైతం మొదటి సారి చేపట్టామన్నారు. లాక్ డౌన్ సమయంలో అనేక పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు.త్వరలోనే రైతుబరోసా కేంద్రాలను పంటల కొనుగోలు కేంద్రాలుగా కూడా వినియోగంలోకి తీసుకువచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

2019 లో గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు. 2020లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. గ్రామ స్థాయి లో విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించామన్నారు.రాష్ట్రంలో ఎక్కడా రైతు భరోసా కేంద్రాల వద్ద క్యు లైన్లు లేకుండా చూసామన్నారు.

క్యు లైన్లో ఉండి గుండెపోటు వచ్చే చనిపోతున్నారన్న  ఆరోపణల్లో నిజం లేదన్నారు.వై యస్ ఆర్ రైతు భరోసా ఇతర వ్యవసాయ అనుబంధ పధకాలు అమలు చేస్తున్న తీరును మంత్రి వివరించారు.2021 ఏడాదిలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిన పెట్టుబడి సాయాన్ని మంత్రి వివరించారు.వైయస్ఆర్ జన్మదినం సందర్భంగా సున్నవడ్డీ పధకం అమలు విధానాన్ని గుర్తుచేశారు. 
 
ఈ సీజన్ లో వ్యవసాయం బ్రహ్మండంగా ... 
ఈ వ్యవసాయ సీజన్ లో రాష్ట్రం మొత్తం మీద అధిక వర్షపాతం నమోదు అయ్యిందని బ్రహ్మాండంగా ప్రారంభమైందని మంత్రి తెలిపారు.అనంత పురం జిల్లాలో ఈ ఏడాది అనుకున్న దానికన్నా అధక వర్షపాతం నమోదు అయ్యిందని అన్నారు.శ్రీకాకుళం జిల్లాలో అనుకున్నదాని కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని వెల్లడించారు.

అక్కడ ప్రత్యాన్మయ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారని పేర్కొన్నారు.ఆ తరువాత విజయనగరం జిల్లాలో సాగుకు అనుకూలంగా లేని చోట్ల మెట్టప్రాంత రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించినట్లు మంత్రి వివరించారు.ప్రధానంగా శివారు ప్రాంతాలపై వ్యవసాయశాఖ అధికారులు,నిపుణులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు మంత్రి కన్నబాబు వివరించారు. 
 
గత ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురిశాయని మంత్రి తెలిపారు. అన్ని రిజర్వాయర్లు నిండాయని అన్నారు. మొత్తం 182 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధించామన్నారు. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం 1,24,48490 ఎకరాలు అయితే ఇప్పటి వరకు 91,99,983 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందన్నారు. విజయనగరం జిల్లాలో కొద్దిగా నాట్లు తక్కువగా పడ్డాయి.

ఈ నెల 15వ తేదీ వరకు చూసి, నాట్లు వేయని భూమి కోసం కంటింజెన్సీ ప్లాన్‌ కూడా సిద్దం చేస్తున్నామన్నారు. నీరు లేని చోట్ల, కాలువ శివారు భూముల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళిక కూడా ప్రకటింబోతోందని మంత్రి వెల్లడించారు.
 
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి ...
రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటుగా మార్కెటింగ్ ఇతర పధకాల ద్వారా రైతులను  అభివృద్ధి చేసేందకు ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకోవాలని అధికారులను ఆదేశించామని వెల్లడించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రాప్ బుకింగ్ 78 శాతం పూర్తయ్యింది. ఈనెల పదో తేదీ నాటికి నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట రుణాలుకూడా ఎక్కువగా ఇచ్చామన్నారు.

గత ఏడాది ఇదే సమయానికి రూ.26,636 కోట్లు ఇస్తే, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 41,241 కోట్లు ఇచ్చామని వివరించారు. మరోవైపు ప్రతీ గ్రామంలో ఒకగోదాం,ప్రతీ మండలంలో కోల్ట్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.మొత్తం మీద రాష్ట్రంలో 1,24,490 హెక్టార్ల పంట సాగు భూమి ఉంటే,ఈ ఏడాది ఇప్పటికే 91,99,903 హెక్టార్లు సాగులోకి వచ్చిందని వెల్లడించారు. 
 
సహకార రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు... 
సహకార రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 730 సహకార సంఘాలు నష్టాల్లో ఉన్నాయన్నారు. వాటిని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రతి డిసిసిబిలోనూ ఫ్యాక్స్ డెవలప్‌మెంట్ సెల్‌ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దానికి నిపుణులైన అధికారులను నియమిస్తామన్నారు.

అలాగే రాష్ట్ర స్థాయిలో ఆప్కాబ్‌ నేతృత్వంలో ఒక అధికారికి బాధ్యతలు ఇస్తున్నాన్నామన్నారు. రాష్ట్రంలో రెండు మినహా మిగిలిన డిసిఎంఎస్‌లు లాభాల్లో వున్నాయని,నష్టాల్లో వున్న వాటిని కూడా లాభాల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.