సైకిల్ దిగనున్న కేశినేని నాని?.. టచ్‌లో కాషాయం నేతలు?

Last Updated: మంగళవారం, 4 జూన్ 2019 (09:54 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీమాంధ్రలో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని ఒకరు. ఈయన విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈయన సైకిల్ దిగిపోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైకాపా అఖండ విజయాన్ని సాధించగా, టీడీపీ మాత్రం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే, టీడీపీ 25 ఎంపీ సీట్లలో పోటీ చేయగా, కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకుంది. అందులో కేశినేని నాని ఒకరు కాగా, గల్లా జయదేవ్ (గుంటూరు), కె. రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం)లు మాత్రమే ఉన్నారు.

వీరిలో నాని ఇపుడు పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందులోభాగంగా, ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలోనే మకాం వేసి, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అందువల్లే ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఇది జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

అదేసమయంలో వచ్చే 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగురవేయాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ఇందులోభాగంగా, తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నారు. ఫలితంగానే కేశినేని నానిపై దృష్టికేంద్రీకరించిన బీజేపీ.. ఆయన్ను తొలుత పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. మొత్తంమీద నాని సైకిల్ దిగి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :