బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (07:27 IST)

సెల్ఫీ వీడియోలో ఏదో తిట్టాడని బెదిరించి దళిత యువకుడి ప్రాణాలు తీస్తారా..?: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో ఆన్ లైన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉంది. రోజుకు 10వేల కేసులు, 100మంది చనిపోవడం, తిరుపతి భయంకరంగా తయారైంది. 30జిల్లాలలో 13ఏపివే. తూగో 50వేలకు మించి పోయింది. నియంత్రణ లేకుండా పోయింది. 
 
బాధ్యత గల రాజకీయ పార్టీగా మన బాధ్యత మనం నిర్వహిస్తున్నాం. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం పనికిరాదు, జాగ్రత్తలు తీసుకోవాలని మొదట్లోనే హెచ్చరించాను, మనల్ని ఎగతాళి చేశారు, వైసిపి నాయకులే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారు. 

మనల్ని మనం కాపాడుకుంటూ, ప్రజలను అప్రమత్తం చేయాలి. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. సామాజిక బాధ్యతకు కట్టుబడిన పార్టీ తెలుగుదేశం. 

అధికారం కోసమో, పదవుల కోసమో పెట్టిన పార్టీ కాదు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పెట్టిన పార్టీ టిడిపి. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్, పార్టీ కార్యకర్తల అకుంఠిత దీక్షలే పార్టీని కాపాడుతున్నాయి. 

ఒకప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయి కూడా రాని కాంగ్రెస్ పార్టీ  తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందనేది గుర్తుంచుకోవాలి. 2014ఎన్నికల్లో వచ్చిన కోటి 20లక్షల ఓట్లు 2019లో కూడా టిడిపికి వచ్చాయి. మిగిలిన పార్టీల ఓట్లన్నీ వైసిపికి పడ్డాయి కాబట్టే ఓట్ల శాతం పెరిగింది, అధికారంలోకి వచ్చింది. 

వైసిపికి కళ్లు నెత్తికొస్తే ప్రజలే కిందకు దించుతారు.
 అన్నా కేంటిన్లు, విదేశీ విద్య, బీమా, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, ఫుడ్ బాస్కెట్ వంటి  34పథకాలను రద్దు చేశారు. ఒకే సంవత్సరం రూ 80వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఇకపై అప్పు కూడా పుట్టని పరిస్థితి కల్పించారు రాష్ట్రానికి..

జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 
పుంగనూరు దళిత యువకుడి అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలి:

‘‘కరోనాలో రూ30వేలు ఖర్చయ్యింది, మద్యం ధరలు 300% పెంచేసి నాసిరకం బ్రాండ్లు అంటగట్టారంటూ’’ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన పుంగనూరు దళిత యువకుడిని బెదిరించి ఆత్మహత్యకు పురిగొల్పారు.  భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక వీళ్లే హతమార్చి ఆత్మహత్య రంగు పూశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
 
సెల్ఫీ వీడియోలో  ఏదో తిట్టాడని బెదిరించి ప్రాణాలు తీస్తారా..? దీనిపై వెంటనే విచారణ జరపాలి.  సిఎంగా ఉన్న వ్యక్తిని(చంద్రబాబును) ఉరి తీయాలని గతంలో ఈయన(జగన్) అనలేదా..? కాల్చి చంపాలని అనలేదా..? ఇప్పుడెవరో కడుపు కాలి ఏదో అంటే బెదిరించి చంపేస్తారా..? 
 
దళిత యువకుడి మృత దేహానికి పోస్ట్ మార్టమ్ జరిపించాలి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. అతను ఆత్మహత్య చేసుకున్నాడా, చంపేసి ఆత్మహత్య నాటకం ఆడుతున్నారా అనేది సమగ్ర విచారణలో గాని బైటపడదు. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వివేకానంద రెడ్డిది కూడా ముందు ఆత్మహత్య అన్నారు, తర్వాత హత్యగా బైటపడింది.

ఏది ఆత్మహత్యో, ఏది హత్యో అర్ధంగాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నేరగాళ్లంతా విశృంఖల విహారం చేస్తున్నారు. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో చోటు లేదు, ఆధ్యాత్మిక జిల్లా చిత్తూరును వైసిపి అరాచకాల ఖిల్లా చేశారు. పెనుమూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ అనితారాణి పట్ల అసభ్యంగా వ్యవహరించారు. మేజిస్ట్రేట్ రామకృష్ణపై రాళ్ల దాడి చేయడమే కాకుండా ఆయన కుటుంబాన్ని ప్రతిరోజూ వేధిస్తున్నారు. ఇప్పుడు పుంగనూరు దళిత యువకుడి ప్రాణాలు బలిగొన్నారు.

ప్రశాంతంగా ఉండే జిల్లాలో పగలు-ప్రతీకారాలా..? 
కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని రవి ని స్టేషన్ కు బలవంతంగా లాకెళ్లి, కేసులు పెడతామని బెదిరించడం, వైసిపి వాళ్లతో మాట్లాడుకోమని హెచ్చరించడం, పార్టీ మారాలని ప్రలోభ పెట్టడం..ప్రభుత్వంలో ఉండేవాళ్లు చేయాల్సిన పనులేనా ఇవి..?  

టిడిపి నాయకులపై, కార్యకర్తలపై, సోషల్ మీడియా కార్యకర్తలపై ఇన్నాళ్లు తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రజలపై కూడా దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. రేపు అనేదే లేనట్లుగా అవినీతికి, అరాచకాలకు తెగబడ్డారు. 
ఆంబోతులు మాదిరి వైసిపి నాయకులు సమాజంపై పడతారా..? 

15నెలలుగా రాష్ట్రంలో ఈ అరాచకాలు ఏంటి..? ఎస్సీల మీద ఈ అఘాయిత్యాలు ఏంటి..? బీసిల మీద ఈ తప్పుడు కేసులు ఏంటి..? ఎస్టీల మీద ట్రాక్టర్ తో గుద్ది చంపడాలు ఏంటి..? ఈ గ్యాంగ్ రేప్ లు ఏంటి..? ఈ శిరోముండనాలు ఏంటి..? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా..? 

అప్పు తీర్చలేదని పల్నాడులో గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కిస్తారా..? మాస్క్ అడిగిన డాక్టర్ ను తాళ్ళతో కట్టేసి లాఠీలతో కొడతారా..? పదిమందికి న్యాయం చెప్పే జడ్జిపై రాళ్లదాడి చేస్తారా..?  నిన్న మున్నంగిలో మరో బీసి సోదరుడిని కులం పేరుతో దుర్భాషలాడి అర్ధనగ్నంగా కూర్చోపెట్టి, అతని భార్యను అసభ్యంగా మాట్లాడతారా..?

30ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న, 30వేల పైగా మెజారిటితో ప్రతిసారి గెలుస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే వైసిపి అహం ఏ స్థాయికి చేరిందో తెలుస్తోంది. 

పరిపాలన గాలికి వదిలేశారు-మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి: 
గత 15నెలలుగా రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారు. మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. 
ప్రపంచం అంతా వైద్యులకు నీరాజనాలు పలుకుతుంటే మన  రాష్ట్రంలో వైద్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు, వైద్యులకు కూడా కులం అంటగడుతున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ అనితారాణి, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ గంగాధర్ ల పట్ల వైసిపి ప్రభుత్వ దుష్ప్రవర్తనే అందుకు ఉదాహరణ. 

ఇసుక, మద్యం స్మగ్లింగ్ పేట్రేగి పోయింది. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి మన రాష్ట్రంలోకి మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. అటు ఇసుక, ఇటు మద్యంతో రెండు చేతులా దండుకుంటున్నారు.

విద్యార్ధి దశలో ఇక్కడే ఎన్నో పోరాటాలు చేశాను. మళ్లీ అంతకు మించిన పోరాటాలు చేయడానికి సిద్దంగా ఉన్నాను. అప్పుడూ ఎస్వీ యూనివర్సిటిలో బలహీన వర్గాల హక్కుల కోసమే పోరాడాను. ఇప్పుడు సమాజంలో బిసిలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనారిటీల హక్కుల కోసమే పోరాడుతున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా నా లక్ష్యం ఒక్కటే.. అరాచకాలను సహించేది లేదు, బలహీన వర్గాలపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు.

మనం భయపడితే బెదిరిస్తారు, తిరగబడితే తోకముడుస్తారు. భయపెడితే భయపడేవాళ్లు ఎవరూ ఇక్కడ లేరనేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నది ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ, లక్షలాది కార్యకర్తల సైన్యం ఉన్నపార్టీ అనేది గుర్తుంచుకోవాలి. 

కష్టకాలంలో ఎవరైతే పార్టీ వెన్నంటి మొదటి నుంచి ఉన్నారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం, గౌరవిస్తాం. యువతను ప్రోత్సహించాలి. బలహీన వర్గాలను ప్రోత్సహించాలి. గ్రూపు విబేధాలకు టిడిపిలో తావు లేదు. 
 
కార్యకర్తలను ఆదుకునే బాధ్యత నాది. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు పార్టీ కోసమే, కార్యకర్తల కోసమే పని చేస్తాను. ‘‘పసుపు చైతన్యం’’ పేరుతో చేపడుతున్న 100 రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అన్నివర్గాల వారిని పార్టీకి చేరువ చేయాలి.
 
గత 15నెలల్లో పార్టీ తరఫున జిల్లాలో 92కార్యక్రమాలు నిర్వహించాం. 55 ఆందోళనలు జరిపారు. ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 

చిత్తూరులో జరిగిన అభివృద్ది అంతా టిడిపి చేసిందే: 
చిత్తూరు నగరంలో అపోలో హాస్పటల్, నర్సింగ్ కళాశాల తెచ్చాం. చిత్తూరు-తిరుపతి మధ్య 3 ఫ్లై వోవర్లు నిర్మించాం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల మధ్య 90కిమీ 6లేన్ రోడ్ అభివృద్ది చేశాం. హంద్రీ నీవా ఎత్తిపోతల పథకాన్ని దాదాపు పూర్తి చేశాం. పలమనేరు, పుంగనూరుకు నీళ్లు ఇచ్చాం. కుప్పం శివారు దాకా నీళ్లు తెచ్చాం. రూ 218కోట్లతో అడవిపల్లె రిజర్వాయర్ పూర్తి చేశాం.

రూ452కోట్లతో అవుకు టన్నెల్ పూర్తి చేశాం. మదనపల్లిలో కాలవ దగ్గరే పడుకున్న స్మృతులు ఇంకా గుర్తున్నాయి.  15నెలలుగా కుప్పానికి నీళ్లు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.  చిత్తూరు, పలమనేరు, కుప్పంలో మార్కెట్ యార్డులు నిర్మించాం. చంద్రగిరిలో 50పడకల ఆసుపత్రి నిర్మించాం. కుప్పం, పలవమనేరులో డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేశాం. 
 
చిత్తూరులో ఏదైనా అభివృద్ది జరిగింది అంటే టిడిపి హయాంలోనే. అది పరిశ్రమ కావచ్చు రోడ్డు కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, హార్టీకల్చర్ కావచ్చు, అన్ని రంగాల్లో చిత్తూరుకు జాతీయంగా, అంతర్జాతీయంగా పేరుతెచ్చాం.  పెట్టుబడుల గమ్యస్థానంగా చిత్తూరు జిల్లాను చేశాం.

3,026పరిశ్రమలను నెలకొల్పాం. ఐఐటి, ఐజర్ వంటి అత్యున్నత విద్యాసంస్థలను తిరుపతిలో ఏర్పాటు చేశాం. రేణిగుంట, ఏర్పేడు ఎలక్ట్రానిక్స్ హబ్ గా చేశాం. కలికిరి మండలంలో టిడిపి నిమ్జ్ తీసుకొస్తే దానిని కూడా నిర్వీర్యం చేశారు. 
 
మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా చేశాం. రూ 200కోట్ల పెట్టుబడితో ఫాక్స్ కాన్ వచ్చింది, 15వేల మందికి ఉపాధి వస్తే అందులో 9వేల మంది మహిళలే. సెల్ కాన్, కార్బన్, డిక్సన్, ఫ్లెక్స్ ట్రానిక్స్ అన్నీ ఇక్కడికే వచ్చాయి. 

150ఎకరాల్లో రిలయన్స్ జియో ఫోన్ల కంపెనీ తెస్తే, దానిని పట్టించుకోలేదు. రూ 3వేల కోట్లతో ఇసుజు కార్ల తయారీ పరిశ్రమలో 2వేల మంది ఉపాధి పొందుతున్నారు. రూ 1600కోట్ల పెట్టుబడి, 12వేల మందికి ఉపాధి కల్పించే హీరో మోటాకార్ఫ్ తెస్తే, 15నెలల్లో దానిని పట్టించుకున్న వాళ్లు లేరు. కెల్లాగ్, రెగ్జమ్ ఇండియా,కాంటినెంటల్ కాఫీ, గ్రీన్ ప్లే అనేక కంపెనీలు చిత్తూరు జిల్లాకు తరలివచ్చేలా పెట్టుబడులు ఆకర్షించాం.

శ్రీసిటిలో టిడిపి 5ఏళ్లలో 90పరిశ్రమలు తెచ్చాం. 45వేల ఉద్యోగాలు కల్పిస్తే అందులో 25వేలు మహిళలే. మాండలీజ్, క్యాప్రికార్న్, పార్లే కంపెనీ, కోబాల్కో, అపోలో టైర్స్ అన్నీ ఇక్కడే..రూ 1, 230కోట్ల పెట్టుబడి 8,050మందికి ఉపాధి కల్పించే పెప్సికో, రూ1,000కోట్ల పెట్టుబడి, 1000మందికి ఉపాధినిచ్చే క్యాడ్బరీ ఇక్కడికే తెచ్చాం. 

మరో షెన్జాయ్ లాగా చేద్దామని ఆరాటపడ్డాం. కృష్ణపట్నం, తిరుపతి, శ్రీసిటి ట్రైసిటిగా అభివృద్దికి బాటలు వేశాం. ఇప్పుడవన్నీ గాలికి వదిలేయడం చూస్తుంటే బాధేస్తోంది.

టిడిపి 5ఏళ్లలో జిల్లాలో 1,000కిమీ సిసి రోడ్లు వేస్తే, గత 15నెలల్లో ఒక్క రోడ్డు వేయలేదు.
14నియోజకవర్గాల్లో పేదలకు 1,70,249 ఇళ్లు మంజూరు చేశాం. 1,10,541ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. 57,449ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం.

ఆడబిడ్డలకు పసుపు కుంకుమతో సామూహిక గృహ ప్రవేశాలు జరిపించాం. ఇప్పుడు ఒక్క ఇల్లు అయినా కట్టారా..? పెండింగ్ బిల్లులు ఇచ్చారా..? ఇళ్ల స్థలాల పేరుతో భారీ ల్యాండ్ స్కామ్ లకు పాల్పడతారా..? మునిగే భూముల్లో పేదలకు ఇళ్లు కడతామని చెబుతారా..? " అని నిలదీశారు.