శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (16:49 IST)

పీకే స్కెచ్ వేస్తే పునాదులు కదిలిపోవాల్సిందే...

పీకే అంటే.. పవన్ కళ్యాణ్ కాదు.. ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహకర్త. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సలహాలు ఇచ్చిన వ్యక్తి. ఇలాంటి విషయాల్లో ఆయన ట్రాక్‌కు తిరుగులేదు. స్కెచ్ వేస్తే గెలిచితీరాల్సిందే. 'నా దారి రహదారి' అన్నట్లుగా అతడి చర్యలు ఊహతీతం. ప్రజానాడిని పట్టుకోవడం ప్రత్యర్థులకు చుక్కలు చూపించి తికమకపెట్టడంలో దిట్ట. వ్యూహకర్తగా రంగంలోకి దిగితే చాలు గెలుపు దాసోహం అనాల్సిందే. ఆయనే ప్రశాంత్ కిషోర్. 
 
ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుడు. జగన్‌కు అఖండ విజయం వరించడానికి తెరవెనుక వ్యూహకర్త. జగన్‌ పదేళ్ల నిరీక్షణ ఫలించడానికి పీకే చేసిన ప్లాన్స్‌ అదుర్స్‌ అనిపించాయి. బీహార్‌లోని బక్సర్‌ ప్రాంతంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌ తొలిసారి 2011లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 
 
ఇప్పటివరకు 5 ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు వ్యూహాలు, ప్రచారం చేశారు. 2012లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు యేడాది ముందుగానే కార్యరంగంలో దిగి వ్యూహరచన చేసి విజయం సాధించారు. 2014లోనూ మోడీ ప్రధాని కావడంలో పీకే వ్యూహాలు ఎంతగానో పనిచేశాయి. ఆయనపై రాజకీయ పార్టీలకు గురి కుదరడంతో 2015లోనే వైసీపీ సంప్రదింపులు జరిపింది. అలా 2017 జూలై 6న ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీ వ్యూహకర్తగా వైసీపీ ముఖ్యనేతలకు జగన్‌ పరిచయం చేశారు. అప్పటి నుంచి వైసీపీలో సరికొత్త వైబ్రేషన్స్‌ మొదలయ్యాయి. 
 
ప్రశాంత్ కిషోర్ టీమ్ అన్నింటా తానై అన్నట్లు వ్యవహరించింది. జగన్ కూడా పీకే టీమ్‌కు ఎనలేని ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఏకంగా నిర్ణయాధికారం ఇవ్వడంతో పార్టీకి తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టడంతో పాటు జగన్‌ను జనసమ్మోహితుడిగా మార్చేశారు. కేవలం వ్యూహాలను అందించడమే కాదు, కాపుల రిజర్వేషన్ విషయంలో జగన్ తన అభిప్రాయం బలంగా చెప్పడంలో బీసీలను దగ్గరకు తీయడంలో పీకే సలహా సూచనలు పక్కాగా ఉన్నాయి. 
 
అదేసమయంలో నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం, కులాల ఈక్వేషన్లు లెక్కించడం అభ్యర్థులను నిర్ణయించడం, వారికి ఖర్చు వ్యవహారంలో ఓ పద్దతి అనేది రూపొందించడం ఇలా చాలా విషయాల్లో పీకే పాత్ర కీలకం. అంతేకాక గ్రామస్థాయి నాయకులనూ చాపకింద నీరులా తమవైపునకు తిప్పుకొన్నారు. 'రావాలి జగన్‌ కావాలి జగన్' పాట, 'జగన్‌ అన్న పిలుపు' పేర్ల చేపట్టిన ప్రచారం సక్సెస్‌ కావడంతో ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు.