శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (13:43 IST)

మీ మరదలు నన్ను మోసం చేసింది... అందుకే చంపేశా.. వెళ్లి చూసుకో...

అనంతపురం జిల్లాలో వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. తనతో సహజీవనం చేస్తున్న ఓ విహహిత ప్రవర్తనను అనుమానించిన ప్రియుడైన ఆటో డ్రైవర్ ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె అక్క భర్తకు ఫోన్ చేసి.. నీ మరదలిని చంపేశా.. వెళ్లి దాన్ని చూసుకో అంటూ ఫోన్ చేసి చెప్పాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన యశోద (32) అనే మహిళకు రాణినగర్‌కు చెందిన శంకర్‌ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్‌ తేజ్, యశ్వంత్‌ అనే కుమారులు ఉన్నారు. 
 
నాలుగేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న యశోధ... బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్‌ మల్లికార్జునతో పరిచయం ఏర్పడి, అది వివాహేర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో వారిద్దరూ గత రెండేళ్లుగా నగరంలోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్‌లో చేర్పించింది.
 
అయితే, యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం వచ్చింది. ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. 
 
యశోద మృతి చెందిన తర్వా మల్లికార్జున... విజయలక్ష్మి భర్తకు ఫోన్ చేసి.. ‘నీ మరదల్ని చంపేశా. వెళ్లి దాన్ని చూసుకోండి’ ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో సంజీవ్‌కుమార్‌ దంపతులు హుటాహుటిన అశోక్‌నగర్‌కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెందింది. దీంతో అక్క విజయలక్ష్మి బోరున విలపించింది. తన చెల్లిని చంపి పిల్లలిద్దరినీ అనాథల్ని చేశాడంటూ మల్లికార్జునకు శాపనార్థాలు పెట్టింది. వన్‌టౌన్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.