శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (10:19 IST)

జగనో మూర్ఖుడు... 2021 తర్వాత మెజార్టీ వైకాపాదే : యనమల

ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంపై మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. జగన్ నిజంగానే తుగ్లక్, ఓ మూర్ఖుడంటూ వ్యాఖ్యానించారు. 
 
2021 నాటికి మండలిలో తెలుగుదేశం బలం తగ్గిపోయి, వైసీపీ నుంచే మెజారిటీ సభ్యులు ఉంటారన్నారు. అయినప్పటికీ మండలిని రద్దు చేయాలని జగన్ ఎందుకంత నిశ్చయంతో ఉన్నారో తెలియడం లేదన్నారు.
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ మండలిని రద్దు చేయాలంటే కనీసం మూడేళ్లు పడుతుందన్నారు. పైగా, ఇప్పటికిప్పుడు శాసన మండలిని రద్దు చేయాలని క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదించినా, 2022లోనే రద్దు సాధ్యమవుతుందన్నారు. 
 
ఇకపై మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ సొంతం చేసుకుంటుందని అనడంలో సందేహం లేదని, ఎమ్మెల్యేల కోటా సభ్యులను, గవర్నర్ నామినేషన్ సభ్యులను ఆ పార్టీ పొందుతుందని యనమల గుర్తు చేశారు. తమ పార్టీ బలం క్రమంగా పెరిగే సభను రద్దు చేయాలని భావించడం జగన్ అవివేకమని ఎద్దేవా చేశారు.
 
తమ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని వైసీపీ నేతలు పలువురికి ఫోన్లు చేసి, ప్రలోభాలకు గురి చేశారని, అయితే, తమ పార్టీ ఎమ్మెల్సీలెవరూ లొంగలేదని ఆయన అన్నారు. 
 
మూడు రోజుల పాటు ఈ ప్రలోభాల పర్వం కొనసాగిందని, ఎవరూ మాట వినలేదు కాబట్టే, అక్కసుతో మండలిని రద్దు చేయాలన్న దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. 
 
ఓ రాజ్యాంగ వ్యవస్థ రద్దు జగన్ అనుకుంటున్నంత సులువు కాదని, ప్రజా వేదికను కూల్చినంత ఈజీగా కౌన్సిల్‌ను రద్దు చేయవచ్చని భావిస్తే, అది మూర్ఖత్వమేనని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.