సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (17:51 IST)

రైతుల కోసమే వైఎస్ఆర్ భరోసా... కడప ముద్దుబిడ్డగా ప్రారంభిస్తున్నా...

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో హామీని నెరవేర్చారు. రైతుల కోసం వైఎస్ఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించారు. తన తండ్రి వైఎస్. జయంతిని పురస్కరించుకుని ఆయన కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని, అందుకే, రైతుల కోసం వైఎస్ఆర్ భరోసా పథకం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే అక్టోబరు 15వ తేదీ నుంచి ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ.12500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
 
వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కింద అవ్వా తాతాలకు రూ.2,250 అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్, డయాలసిస్ పేషెంట్లకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేస్తున్నామని గుర్తుచేశారు. పింఛను రాకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోను నంబరును ప్రకటిస్తామన్నారు.
 
సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తోందని, ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. అర్హుడైన ప్రతి రైతుకు ఉచిత రైతును అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
 
అలాగే, కేసీ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కుందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26వ తేదీన శంకుస్థాపన చేస్తామన్నారు. మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామని, 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 
 
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అభివృద్ధికి మొదటి అడుగు పడుతుందన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలన్నీ డోర్‌ డెలివరీ చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, వ్యవసాయ లేబొరేటరీలను ఏర్పాటు చేస్తామని, రైతులకు నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామని చెప్పారు. 
 
భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడతామని, అదే సమయంలో కౌలు రైతులకు అండగా ఉంటామని, కౌలు రైతు చట్టంలో మార్పులు తెస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు. చెన్నూర్ షుగర్ ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తామని హామీ ఇచ్చారు. 
 
ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.