సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఈ రోజు వరకు ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు.. దానికి సాక్ష్యం మా అమ్మే... మీకు దమ్ముందా : వైఎస్ షర్మిల

yssharmila
అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి తన అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లినట్టు అభాండాలు వేస్తున్నారని, ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు. దానికి సాక్ష్యం మా అమే. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 
 
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు.. తక్కువా కాదు. నేను వైఎస్‌ఆర్‌ కుమార్తెను అయినప్పుడు వైఎస్‌ షర్మిల కాకుండా ఎలా ఉంటాను. నా కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా. 
 
నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు. మీ ఆరోపణలు నిజం కాదని నేను ప్రమాణం చేయగలను. మీరు చేయగలరా? అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారు. ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు. దానికి సాక్ష్యం మా అమ్మే. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి అని షర్మిల వ్యాఖ్యానించారు. 
 
మా కుటుంబం చీలిపోవడానికి కారణం జగనన్నే : వైఎస్ షర్మిల 
 
ఏపీ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాకుండా, తమ కుటుంబాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీల్చిందంటూ జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. తమ కుటుంబం చీలిపోవడాని కాంగ్రెస్ పార్టీ కాదనీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియంతగా మారిన తన అన్న జగన్మోహన్ రెడ్డేనని తేల్చిపడేశారు. దీనికి మా అమ్మ విజయలక్ష్మి, యావత్ మా కుటుంబమే సాక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. 
 
ఏలూరులో జరిగిన ఉభయగోదావరి జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. "వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం చీలిపోవడం చేతులారా జగన్ చేసుకున్నదే. ఆయన వల్లే చీలిపోయింది. దీనికి సాక్ష్యం మా తల్లి విజలక్ష్మి. ఆ దేవుడు సాక్ష్యం. నా యావత్ కుటుంబమే సాక్ష్యం అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పూర్తిగా మారిపోయారని" చెప్పారు. 
 
తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా రాష్ట్రానికి మేలు చేస్తే చాలనుకున్నాను. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుని వైఎస్ఆర్‌కు మంచి పేరు తెస్తే చాలనుకున్నాను. కానీ ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముంచేశాడు. భారతీయ జనతా పార్టీకి వైకాపాను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చేశాడు. పూర్తి నియంతలా మారిపోయాడు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులోనే ఉండిపోయాడు. ప్రజలను కలవడమే మానేశాడు. పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛే లేకుండా చేశాడు. వైఎస్ ప్రజల మనిషి అయితే.. జగన్ ప్రజలకు దూరంగా మెలిగే వ్యక్తి అని ఆమె ఆరోపించారు. 
 
వైఎస్ వారసులమని చెప్పుకుంటే సరిపోదని, పాలనలోనూ ఆయన కనిపించాలన్నారు. వీరిద్దరి పాలనకు భూమికి - ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడమే కాకుండా, తమ కుటుంబాన్ని కూడా చీల్చిందని ఇటీవల జగన్ మాట్లాడాడని, కానీ, రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయంగా ఉండటానికి ఆయనే కారణమన్నారు.